యువరాజ్ ను పక్కన పెట్టేశారు..!
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత.. ఈ ఏడాది ఆరంభంలో భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన స్థానాన్ని ఎంతో కాలం నిలుపులేకపోయాడు. చివరిగా జూన్ లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఆడిన యువీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అంతకుముందు చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై అర్ధ సెంచరీ చేసిన యువరాజ్ చివరి ఏడు వన్డేల్లో 162 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ క్రమంలోనే ఇటీవల శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ కు సైతం యువరాజ్ ను ఎంపిక చేయలేదు.
ఇదిలా ఉంచితే, భారత పర్యటనలో భాగంగా ఆసీస్ క్రికెట్ జట్టుతో వార్మప్ మ్యాచ్ కు ఎంపిక చేసిన జట్టులో కూడా యువరాజ్ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ మేరకు బోర్డు ప్రెసిడెంట్ జట్టును సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. యువరాజ్ ఫామ్ తో పాటు ఫిట్ నెస్ ను కూడా పరీక్షించేందుకు అతనికి ఒక అవకాశం లభించవచ్చని తొలుత భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యువీని అస్సలు పట్టించుకోలేదు.
అదే సమయంలో దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టు ఒక్కసారిగా సీన్ లోకి వచ్చింది. ఈ ట్రోఫీకి ఎంపికైన 45 మంది టాప్ ఆటగాళ్లలో పరిగణలోకి తీసుకుని బోర్డు ప్రెసిడెంట్ జట్టును ఎంపిక చేశారు. ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్-10 సీజన్ లో మెరిసిన కొంతమంది ఆటగాళ్లను సైతం వార్మప్ మ్యాచ్ కోసం సిద్ధం చేశారు. దాంతో భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఎంపిక జరిగిందనే సంకేతాల్ని మన సెలక్టర్లు మరోసారి ఇచ్చినట్లయ్యింది. ఈ నేపథ్యంలో 36వ ఒడిలో ఉన్న యువరాజ్ మాత్రం ఇక భారత జట్టు జెర్సీ ధరించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు సంబంధించి రోడ్ మ్యాప్‌లో యువీ పాత్ర ఉండకపోవచ్చు. ఈ నెల 12 వ తేదీన ఆసీస్ జట్టుతో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు వార్మప్ వన్డే ఆడనుంది.
బోర్డు ఎలెవన్ స్క్వాడ్: గుర్ కీరత్ సింగ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, శివం చౌదరి, నితీశ్ రానా, గోవింద్ పాద్దర్, శ్రీవాట్స్ గోస్వామి, అక్షయ్ కర్నేవార్, కుల్వంత్ ఖజ్రెలియా, కుశాల్ పటేల్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రహిల్ షా