కనీసం 30 ఓవర్లయినా ఆడలేకపోయింది! | New Zealand beats Sri Lanka by 10 wickets | Sakshi
Sakshi News home page

లంక బోల్తా

Published Sun, Jun 2 2019 1:08 AM | Last Updated on Sun, Jun 2 2019 9:00 AM

New Zealand beats Sri Lanka by 10 wickets  - Sakshi

ఏమాత్రం ఆశల్లేకుండా కప్‌లో అడుగు పెట్టిన శ్రీలంక... తమ తొలి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన కనబర్చింది. బ్యాట్స్‌మెన్‌ ఒకరి వెంట వరుస కట్టిన వేళ... జట్టు కనీసం 30 ఓవర్లయినా ఆడలేకపోయింది. శుక్రవారం వెస్టిండీస్‌ చేతిలో పాకిస్తాన్‌లాగే... శనివారం న్యూజిలాండ్‌ చేతిలో ఘోరంగా ఓడింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రత్యర్థిని కివీస్‌ పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్‌ అల్లాడించారు. ముఖ్యంగా హెన్రీ పేస్, స్వింగ్‌ బంతులతో మొదట్లోనే దెబ్బ కొట్టాడు. అనంతరం బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయిన లంక 10 వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది.  

కార్డిఫ్‌: ప్చ్‌...! లంక ఆట మారలేదు. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌లోనూ వారి ఆటగాళ్లు ఫామ్‌ అందుకోలేదు. ఫలితం... న్యూజిలాండ్‌పై దారుణ ఓటమి. పేసర్లు రాణించడంతో రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక... మాట్‌ హెన్రీ (3/29), లాకీ ఫెర్గూసన్‌ (3/22) పేస్‌ దెబ్బకు 29.2 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె (84 బంతుల్లో 52 నాటౌట్‌; 4 ఫోర్లు) ఒక్కడే అజేయంగా పోరాడాడు.

కుశాల్‌ పెరీరా (24 బంతుల్లో 29; 4 ఫోర్లు), తిసారా పెరీరా (23 బంతుల్లో 27; 2 సిక్స్‌లు) కాసేపు నిలవగలిగారు. వీరు కాక మరే బ్యాట్స్‌మన్‌ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. అనంతరం ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (51 బంతుల్లో 73 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కొలిన్‌ మున్రో (47 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) దూకుడైన ఆటతో 16.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 137 పరుగులు చేసి న్యూజిలాండ్‌ లక్ష్యాన్ని అందుకుంది. లంకను కోలుకోలేని దెబ్బకొట్టిన హెన్రీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

అతడు మినహా...!
హెన్రీ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించి తిరిమన్నె (4) లంక ఇన్నింగ్స్‌ ఖాతా తెరిచాడు. కానీ, మరుసటి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఔటివ్వకున్నా కివీస్‌ సమీక్ష కోరి విజయవంతమైంది. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. హెన్రీ, బౌల్ట్‌ బౌలింగ్‌లో రెండేసి ఫోర్లు కొట్టాడు. అయితే, నాలుగు ఓవర్ల తొలి స్పెల్‌ ముగిసినా విలియమ్సన్‌... హెన్రీని కొనసాగించడం ఫలితం ఇచ్చింది. అతడి బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయిన కుశాల్‌ మిడాన్‌లో గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరుసటి బంతికి కుశాల్‌ మెండిస్‌ (0) స్లిప్‌లో గప్టిల్‌ డైవింగ్‌ క్యాచ్‌కు వెనుదిరిగాడు.

ధనంజయ డిసిల్వా (4)ను ఫెర్గూసన్‌ ఎల్బీ చేశాడు. మాథ్యూస్‌ (0), జీవన్‌ మెండిస్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. 60/6తో నిలిచిన ఈ దశలో కరుణరత్నె, తిసారా వికెట్ల పతనాన్ని అడ్డుకుని జట్టు స్కోరును 100 దాటించారు. కానీ, తిసారా, ఉదాన (1) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో పరిస్థితి చేయిదాటింది. లక్మల్‌ (7), మలింగ (1) తర్వాత వరుస కట్టారు. 81 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కరుణరత్నె నాటౌట్‌గా మిగిలాడు. ప్రపంచ కప్‌లో ఇన్నింగ్స్‌ ఆసాంతం నాటౌట్‌గా నిలిచిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

ఎదురులేకుండా...
బంతి బ్యాట్‌పైకి వస్తుండటంతో ఛేదనలో కివీస్‌ ఓపెనర్లు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆడారు. మలింగ వేసిన తొలి ఓవర్లోనే గప్టిల్‌ రెండు ఫోర్లు బాది దూకుడు చూపాడు. లక్మల్‌ బౌలింగ్‌లో మున్రో ఫోర్, సిక్స్‌తో ధాటిని ప్రదర్శించాడు. ఓవర్లు పెరుగుతున్న కొద్దీ స్కోరును మరింత ముందుకు తీసుకెళ్లారు. ఉదాన ఓవర్లో సిక్స్‌తో గప్టిల్‌ (39 బంతుల్లో), తిసారా బౌలింగ్‌లో రెండు పరుగులు చేయడం ద్వారా మున్రో (41 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 13వ ఓవర్లోనే కివీస్‌ 100 పరుగుల మార్క్‌ అందుకుంది. మిగిలినవాటిని మరో 3.1 ఓవర్లలోనే పూర్తి చేసి గెలిచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement