
లండన్: స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని ఆశ పడుతోంది ఇంగ్లండ్. 27 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన క్రమంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెగా ట్రోఫీని వదులుకోకూడదని ఇంగ్లండ్ భావిస్తోంది. మరొకవైపు కివీస్ కూడా తొలి వరల్డ్‌కప్‌పై కన్నేసింది. ఇప్పటివరకూ ఒక్కసారిగా వరల్డ్‌కప్ గెలవలేకపోయిన కివీస్.. ఇంగ్లండ్‌కు షాకివ్వాలని యోచిస్తోంది. గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా సరిపెట్టుకున్న కివీస్..కప్ కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది.
ఏది ఏమైనా కొత్త చాంపియన్ అవతరించనున్న తరుణంలో ఇరు జట్ల మధ్య ఆదివారం క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో జరుగనున్న మెగా సమరం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలోనే కివీస్‌తో అప్రమత్తంగా ఉండాలని జట్టు సభ్యులను హెచ్చరించాడు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. కివీస్‌ను ఓడించాలంటే సమిష్టిగా రాణించక తప్పదంటూ స్పష్టం చేశాడు. ‘ కివీస్‌తో అంత ఈజీ కాదు. న్యూజిలాండ్ మొదట్నుంచి ఆకట్టుకుంటూనే ఫైనల్‌కు చేరింది. ప్రధానంగా లీగ్ దశలో కివీస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నాకౌట్ సమరంలో బలమైన టీమిండియాను ఓడించింది. వారి అసలు సిసలు ప్రదర్శన సెమీస్‌లో కనబడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కివీస్‌పై పైచేయి సాధించడం చాలా కష్టం. సమిష్టిగా పోరాడితేనే కివీస్‌ను ఓడించగలం’ అని మోర్గాన్ పేర్కొన్నాడు.