ఫెర్గూసన్‌కు సహచరుల అభినందన
నెల్సన్: ఇంగ్లండ్ లక్ష్యం 181 పరుగులు. 15వ ఓవర్ పూర్తవకముందే 139/2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. 5.1 ఓవర్లలో అంటే 31 బంతుల్లో 42 పరుగులే చేస్తే గెలిచేది! పొట్టి ఫార్మాట్‌లో ఇది సులువైన విజయ సమీకరణం. మరో 8 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్‌కు ఇది ఇంకా ఇంకా సులువైన లక్ష్యం. కానీ విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచి అనూహ్యంగా ఓడింది. 10 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు తీసిన న్యూజిలాండ్ గెలుపు మలుపు తీసుకుంది. నాటకీయంగా ముగిసిన మూడో టి20లో కివీస్ 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ (35 బంతుల్లో 55; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), గప్టిల్ (17 బంతుల్లో 33; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. రాస్ టేలర్ 27, నీషమ్ 20 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్ స్యామ్ కరన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగలిగింది. మలాన్ (34 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), విన్స్ (39 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు చకచకా 63 పరుగులు జతచేశారు. అయితే 15వ ఓవర్ వేసిన సాన్‌ట్నర్ ఆఖరి బంతికి కెప్టెన్ మోర్గాన్ (18)ను ఔట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. తర్వాత వచ్చిన బిల్లింగ్స్ (1) రనౌట్ కావడం, క్రీజ్‌లో పాతుకుపోయిన విన్స్‌తో పాటు కరన్ (2), గ్రెగరీ (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ (2/25), టిక్నెర్ (2/25) రాణించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టి20 మ్యాచ్ 8న నేపియర్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment