నెయమార్ పై వేటు
సాంటియాగో:కోపా అమెరికా కప్‌లో భాగంగా కొలంబియాతో గురువారం జరిగిన మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిన బ్రెజిల్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ నెయమార్ పై బహిష్కరణ వేటు పడింది. బ్రెజిల్ ఆడే తదుపరి నాలుగు మ్యాచ్ ల నుంచి నెయమార్ ను బహిష్కరిస్తున్నట్లు దక్షిణ అమెరికా ఫుట్ బాల్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ సభ్యులు శుక్రవారం నెయమార్ పై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందే నెయమార్ ఒక ఎల్లో కార్డ్ బారిన పడటంతో.. అతనిపై వేటు తప్పలేదు.
ఇటీవల కొలంబియాతో మ్యాచ్ లో బ్రెజిల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిశాక ఇరుజట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కొలంబియా ఆటగాళ్లు రెచ్చగొట్టినా.. మ్యాచ్‌లో ఓపికగా ఉన్న స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ మ్యాచ్ ముగిశాక అదుపుతప్పాడు. ఒక్కసారిగా గోల్ స్కోరర్ మురిలోను తలతో బాదాడు. దీంతో రెచ్చిపోయిన కొలంబియా ఆటగాళ్లు బ్రెజిల్ ప్లేయర్లపై తిరగబడ్డారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకున్నారు. సంఘటనకు కారకుడైన నెయ్‌మార్‌కు రిఫరీ రెడ్‌కార్డు ఇచ్చారు.