న్యూజిలాండ్‌ను ఆదుకున్న నికోల్స్
హెన్రీ నికోల్స్ సెంచరీ దక్షిణాఫ్రికా 24/2
వెల్లింగ్టన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోల్స్ కెరీర్‌లో తొలి సెంచరీ (161 బంతుల్లో 118, 15 ఫోర్లు) సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండోటెస్టులో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. గురువారం తొలిరోజు మొదటి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు బేసిన్ రిజర్వ్ మైదానంలో ప్రారంభమైన ఈమ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే 21/3తతో కష్టాల్లో పడింది. ఈదశలో నికోల్స్.. నీల్ బ్రూమ్ (15)తో జట్టు ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. నాలుగో వికెట్‌కు వీర్దిదరూ 52 పరుగులు జోడించారు. అనంతరం బ్రూమ్ వెనుదిరిగినా.. బీజే వాట్లింగ్ (35)తో కలసి ప్రొటీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.
ఈ క్రమంలో ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 103 పరుగులు జోడించాడు. సఫారీలపై ఈ వికెట్‌కు కివీస్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ఈక్రమంలో సెంచరీ పూర్త చేసిన నికోల్స్ వెనుదిరిగాడు.చివర్లో టిమ్ సౌథీ (27) పోరాడడంతో జట్టు స్కోరు 250 పరుగుల మార్కును దాటింది. బౌలర్లలో డుమినికి నాలుగు, మోర్నీ మోర్కెల్, కంగిసో రబాడ, కేశవ్ మహారాజ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలు ఆటముగిసేసరికి 7 ఓవర్లలో రెండు వికెట్లకు 24 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టీఫెన్ కుక్ (3), డీన్ ఎల్గర్ (9) త్వరగానే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో హషీమ్ ఆమ్లా (0), నైట్ వాచ్‌మన్ రబాడ (8) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి కంటే మరో 244 పరుగుల వెనుకంజలో ప్రొటీస్ నిలిచింది.