కిరియోస్ కేక
ఏడో సీడ్ రావ్‌నిక్‌పై సంచలన విజయం
11వ సీడ్ దిమిత్రోవ్‌కు గాస్కే షాక్
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, వావ్రింకా
వింబుల్డన్ టోర్నమెంట్
లండన్: గతేడాది మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించి వెలుగులోకి వచ్చిన ఆస్ట్రేలియా యువతార నిక్ కిరియోస్ ఈసారి మరో సంచలనం సృష్టించాడు. నిరుడు సెమీఫైనల్ చేరుకున్న ఏడో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా)పై కిరియోస్ అద్భుత విజయం సాధించి వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో 27వ సీడ్ కిరియోస్ 5-7, 7-5, 7-6 (7/3), 6-3తో రావ్‌నిక్‌ను కంగుతినిపించాడు.
2 గంటల 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 20 ఏళ్ల కిరియోస్ 34 ఏస్‌లు సంధించాడు. రెండో సెట్‌లో ఒకసారి, నాలుగో సెట్‌లో మరోసారి రావ్‌నిక్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ ఆసీస్ రైజింగ్ స్టార్ కేవలం 13 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు షరపోవా ప్రియుడు, 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.
21వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4తో నిరుటి సెమీఫైనలిస్ట్ దిమిత్రోవ్‌ను ఓడించి 2012 తర్వాత ఈ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గాస్కే ప్రతి సెట్‌లో ఒక్కోసారి దిమిత్రోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. సోమవారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరియోస్‌తో గాస్కే తలపడతాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 14వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
జొకోవిచ్ 6-3, 6-3, 6-3తో 27వ సీడ్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించగా... వావ్రింకా 6-4, 6-3, 6-4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)ను ఓడించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులపై ఐదు సెట్‌ల పోరాటంలో నెగ్గిన వెర్దాస్కో ఈసారి వావ్రింకా ధాటికి వరుస సెట్‌లలో చేతులెత్తేశాడు. డేవిడ్ గాఫిన్ 6-3, 6-4, 6-2తో బగ్ధాటిస్ (సైప్రస్)పై, అండర్సన్ 6-4, 7-6 (8/6), 6-3తో 24వ సీడ్ మాయెర్ (అర్జెంటీనా)పై గెలిచారు.
షరపోవా జోరు
మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) తన విజయపరంపరను కొనసాగిస్తోంది. మూడో రౌండ్‌లో నాలుగో సీడ్ షరపోవా 6-4, 6-3తో ఇరీనా కామెలియా బెగూ (రుమేనియా)ను ఓడించింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 3-6, 6-3, 6-1తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, 16వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-3, 6-2తో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)పై, కోకో వాండెవెగె (అమెరికా) 6-2, 6-0తో 22వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై, 23వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-4, 6-4తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)పై, 30వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 7-5, 7-5తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)పై నెగ్గారు. మరో మ్యాచ్‌లో జరీనా దియాస్ (కజకిస్తాన్) 7-5, 6-4తో 14వ సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది.
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జంట
పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో బోపన్న-మెర్జియా 7-5, 7-6 (7/5), 7-6 (7/5)తో థామస్ బెలూచీ (బ్రెజిల్)-గిలెర్మో దురాన్ (అర్జెంటీనా)లపై గెలిచారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో మహేశ్ భూపతి (భారత్)-అలా కుద్రయెత్సోవా (రష్యా) జంట 7-5, 3-6, 2-6తో నికొలస్ మోన్‌రో-మాడిసన్ బ్రెంగిల్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.