'నాపై ఎందుకింత పక్షపాతం'
మెల్బోర్న్: రియో ఒలింపిక్స్ కు వెళ్లనున్న ఆస్ట్రేలియా టెన్నిస్ జట్టు నుంచి ఆ దేశ స్టార్ ఆటగాడు నిక్ కిరియోస్ ను పక్కకు పెట్టడంతో అతను ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీపై మండిపడ్డాడు. ఆస్ట్రేలియా ఒలింపిక్ చీఫ్ తనను కావాలనే తప్పించారని విమర్శించాడు. తాను రియోలో దేశానికి పతకం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతానని స్పష్టం చేసినా పట్టించుకోలేదన్నాడు. ఇలా జరగడం నిజంగా దురదృష్టమని కిరియోస్ పేర్కొన్నాడు.
'గత నాలుగు వారాల నుంచి నా పట్ల మా ఒలింపిక్ చీఫ్ ప్రవర్తన బాగాలేదు. నాతో పక్షపాతంగా వ్యవహరించారు. రియోలో పాల్గొనే ఆస్ట్రేలియా ఒలింపిక్స్ జట్టులో నేను పాల్గొనే అర్హత ఉన్నా, మా ఒలింపిక్ చీఫ్ మాత్రం అన్యాయంగా ప్రవర్తించారు. నాపై ఎందుకింత పక్షపాతం. ఇక ఈ అంశంపై ఒలింపిక్ కమిటీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు' అని కిరియోస్ స్పష్టం చేశాడు.