
'అంతకంటే మంచి ఉద్యోగం లేదు'
ముంబై: షోయబ్ అక్తర్.. అటు క్రికెటర్గా ఆపై వ్యాఖ్యాతగా మనకు సుపరిచితమే. అయితే త్వరలో మనముందుకు రాబోతున్న ఓ భారతీయ టెలివిజన్ కామెడీ షోకు అక్తర్ జడ్జిగా వ్యవహరించనున్నాడు. నవ్వులతో నిండిపోయే ఆ షోకు జడ్జిగా చేయడానికి సిద్ధం కావడం పట్ల అక్తర్ అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఒకవైపు ఆ షోకు జీతాన్ని తీసుకుంటూనే జోక్స్ను ఆస్వాదించడం అంటే అదొక మధురమైన అనుభూతిగా అక్తర్ పేర్కొన్నాడు.
'నేను ఇండియన్ మజాక్ లీగ్కు జడ్జిగా వ్యవహరిస్తున్నా. ఆ కామెడీ షోను ఆస్వాదిస్తూనే మరొకవైపు నా జాబ్కు డబ్బులు తీసుకుంటా. అంతకంటే మంచి ఉద్యోగం ఇంకేముంటుంది. ఇది నా దృష్టిలో అన్నిటికంటే మంచి ఉద్యోగం'అని అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. తాను గతంలో పాకిస్తాన్ కు ఆడిన సందర్భాల్లో మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం జోక్స్తో నిండిపోయేదన్నాడు. ఆ సమయంలో ప్రతీ క్రికెటర్ జోక్స్ వేయడంతో తనివి తీరా నవ్వుకునే వాళ్లమని తన గత జ్ఞాపకాల్ని అక్తర్ గుర్తు చేసుకున్నాడు.