ఆసీస్‌నూ వదలకండి: అఫ్గన్‌ జట్టుపై పాక్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు | CT 2025 Dont Spare England Australia: Akhtar Wants Afghanistan to win | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్‌ జట్టుపై పాక్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

Published Thu, Feb 27 2025 4:44 PM | Last Updated on Thu, Feb 27 2025 5:03 PM

CT 2025 Dont Spare England Australia: Akhtar Wants Afghanistan to win

అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌(Shoaib Akhtar) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌(Afghanistan vs England)తో మ్యాచ్‌లో హష్మతుల్లా బృందం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని.. ఇదే జోరులో ఆస్ట్రేలియాను కూడా ఓడించాలని ఆకాంక్షించాడు. అఫ్గన్ ఆటగాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని... దేశం మొత్తాన్ని గర్వించేలా చేశారని కొనియాడాడు.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా అఫ్గనిస్తాన్‌.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్‌-‘బి’లో ఉంది. ఈ ‍క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 107 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది అఫ్గనిస్తాన్‌. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం అద్బుత విజయంతో సెమీస్‌ రేసులోకి దూసుకువచ్చింది.

ఇంగ్లండ్‌ నిష్క్రమించగా..
లాహోర్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల తేడాతో బట్లర్‌ బృందాన్ని ఓడించింది. దీంతో ఇంగ్లండ్‌ ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అఫ్గనిస్తాన్‌ తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఫలితాన్ని బట్టే గ్రూప్‌-బి నుంచి సెమీస్‌ చేరబోయే జట్లు ఖరారు కానున్నాయి.

మీరేం బాధపడకండి సోదరా..!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ అఫ్గనిస్తాన్‌ జట్టును ఆకాశానికెత్తాడు. ‘‘మీకు శుభాకాంక్షలు. మీ విజయం పట్లనాకెంతో సంతోషంగా ఉంది. గుల్బదిన్‌(అఫ్గనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌)ను కలిసినపుడు.. ‘మీరు ఇంగ్లండ్‌ను తప్పక ఓడించాలి’ అని అతడితో అన్నాను. అప్పుడు అతడు.. ‘మీరేం బాధపడకండి సోదర.. వాళ్లను మేము అస్సలు ఉపేక్షించం.. ఓడించి తీరతాం’ అన్నాడు.

ఆ తర్వాత నేను.. ‘ఆస్ట్రేలియాను కూడా మీరు ఓడించాలి’ అని కోరాను. దుబాయ్‌లో ఉన్నపుడు నేను గుల్బదిన్‌తో ఈ మాటలు చెప్పాను. ఏం చేసైనా ఇంగ్లండ్‌పై గెలుపొందాలని అతడికి బలంగా చెప్పాను. ఈరోజు అఫ్గనిస్తాన్‌ ఆ పని చేసి చూపించింది. ఆటలో ఎలా ముందుకు దూసుకువెళ్లాలో చెబుతూ గొప్ప పరిణతి కనబరిచింది.

పటిష్ట జట్టును ఓడించింది. ఈరోజు మీదే. అయితే, సెమీ ఫైనల్‌ చేరాలనే లక్ష్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి అది పునరావృతం కాకూడదు. 

ఆసీస్‌నూ వదలకండి
నిజానికి మీరు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి జట్లతో కూడిన కఠినమైన గ్రూపులో ఉన్నారు. అయినా, సరే ఈరోజు అత్యద్భుతంగా ఆడారు. మాకు మజానిచ్చే మ్యాచ్‌ అందించినందుకు ధన్యవాదాలు’’ అని షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఇంగ్లండ్‌ను ఓడించిన హష్మతుల్లా షాహిది బృందం.. ఈసారి కూడా వారిపై గెలుపొందింది. అయితే, నాటి టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ విజయానికి చేరువైన సమయంలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ భీకర ద్విశతకంతో అఫ్గన్‌ నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు. ఈ క్రమంలోనే అక్తర్‌ ఈసారి అఫ్గనిస్తాన్‌ మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించాడు.

చాంపియన్స్‌ ట్రోఫీ-2025: అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌
👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్‌
👉టాస్‌: అఫ్గనిస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌
👉అఫ్గనిస్తాన్‌ స్కోరు: 325/7 (50)
👉ఇంగ్లండ్‌ స్కోరు: 317 (49.5)
👉ఫలితం: ఇంగ్లండ్‌పై ఎనిమిది పరుగుల తేడాతో అఫ్గన్‌ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఇబ్రహీం జద్రాన్‌(146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 177 రన్స్‌).

చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్‌ తనకే.. బాధగా ఉంది: బట్లర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement