కొలంబో: ఇటీవల శ్రీలంకతో ముక్కోణపు సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత బ్యాటింగ్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్.. తన ఆడిన రెండో మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు సాధించడంతో పాటు పదుపు బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో ముఖ్య భూమిక పోషించడం ద్వారా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అయితే భారత్ జట్టుకు విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన తర్వాత అతను రెగ్యులర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆ సమయంలోనే తనకు హార్దిక్‌తో పోలిక తేవద్దని విన్నవించిన విజయ్ శంకర్.. బంగ్లాతో మ్యాచ్‌లో భాగంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునే క్రమంలో కూడా మరోసారి విన్నవించాడు.
'చాలా మంది క్రికెటర్లు మరొకరితో పోల్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకుంటే వేరే వాళ్లతో పోలిక తెచ్చుకుంటే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆ క్రమంలో మన అత్యుత్తమ ప్రదర్శనకు ఇబ్బందిగా మారుతుంది. అలానే నన్ను హార్దిక్ పాండ్యాతో పోల‍్చితే ఒత్తిడిలో పడే అవకాశం ఉంది. ప్రతీరోజూ మెరుగవుతూ రాటుదేలడమే నా దృష్టిలో సరైనది. అంతేకానీ పోలికలతో ప్రదర్శన అనేది ఆధారపడి వుండదు' అని విజయ్ శంకర్ పేర్కొన్నాడు.
కాగా, తన బౌలింగ్‌లో పలు క్యాచ్‌లను వదిలేయడాన్ని కూడా శంకర్ తేలిగ్గా తీసుకున్నాడు. అది గేమ్‌లో ఒక భాగంగా అభివర్ణించిన విజయ్ శంకర్.. అలా క్యాచ్‌లు వదిలేయడం తనపై ఏమీ ప్రభావం చూపలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment