సౌరవ్ గంగూలీ
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఈ ఏడాది ఏదో ఒక సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరగవచ్చని ఆశిస్తున్న వారికి ఇది నిరాశ కలిగించేదే. నేరుగా చెప్పకపోయినా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన తాజా వ్యాఖ్య పరోక్షంగా అదే సూచిస్తోంది. జర్మనీలోని ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ లీగ్ ‘బుండెస్‌లిగా’ మే నెల మొదటి వారం నుంచి ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్య చేశాడు. ‘సామాజిక వ్యవహారశైలి విషయంలో భారత్, జర్మనీకి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి.
నాకు తెలిసి సమీప భవిష్యత్తులో భారత్‌లో క్రికెట్ సాధ్యం కాకపోవచ్చు. ఈ సమయంలో ప్రేక్షకులు లేకుండా క్రికెట్ ఆడించడం గురించి ఆలోచించడం కూడా అనవసరం. కానీ, అయితే లాంటి ఎన్నో అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఆటలను నేను ప్రోత్సహించను’ అని గంగూలీ స్పష్టం చేశాడు. అతని మాజీ సహచరుడు హర్భజన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు. భజ్జీ చెప్పిన మాటలు కూడా ఐపీఎల్ నిర్వహణ ఎంత కష్టమో సూచిస్తున్నాయి.
‘భారత్‌లో అగ్రశ్రేణి క్రికెటర్లను చూసేందుకు జనం స్టేడియాలకు మాత్రమే రారు. ఒక ఐపీఎల్ జట్టు ప్రయాణిస్తుందంటే స్టేడియం బయట, హోటల్ వద్ద, ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడతారు. భౌతిక దూరం పాటించాల్సిన సమయంలో వీరందరినీ ఎలా ఆపగలం. నాకు తెలిసి కోవిడ్–19కు ఏదో వ్యాక్సిన్ కనుగొనే వరకు క్రికెట్ జరగరాదు’ అని మాజీ ఆఫ్‌స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. ఖాళీ మైదానాల్లో ఐపీఎల్‌ను నిర్వహించాలని ప్రసారకర్తలు భావిస్తున్నా... తాము అందుకు సిద్ధంగా లేమని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కేఎస్ విశ్వనాథన్ వెల్లడించారు. చెపాక్ స్టేడియంలో తమ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కే భారీ సంఖ్యలో జనం వచ్చారని, భారత అభిమానులను నిలువరించడం అంత సులువు కాదని ఆయన అన్నారు. ప్రాణాపాయం ఉండే ఇలాంటి సమయంలో తమకు నష్టాలు వస్తాయని తెలిసినా తప్పదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment