అల్ అమరాట్: లిస్ట్-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు నమోదైంది. తాజాగా ఒమన్ క్రికెట్ జట్టు మూడు పదుల స్కోరు కూడా చేయకుండానే కుప్పకూలడంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్ జట్టు 17.1 ఓవర్లలోనే 24 పరుగులకు ఆలౌటైంది. ఇందులో ఓపెనర్లు టీకే భండారీ, జతీందర్ సింగ్‌లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరితే, మిగతా ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఖవర్ అలీ(15) ఒక్కడే రెండంకెల స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో రుద్రి స్మిత్, ఆడ్రియన్ నెయిల్‌లు తలో నాలుగు వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించారు. ఇది లిస్ట్-ఎ క్రికెట్‌లో నాల్గో అత్యల్ప స్కోరుగా రికార్డు అయ్యింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు రికార్దు వెస్టిండీస్ పేరిట ఉంది. 2007లో బార్బోడాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అండర్-19 జట్టు 18 పరుగులకే ఆలౌటైంది. ఇదే నేటికీ లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు. తాజా మ్యాచ్‌లో 25 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్ వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలో ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment