పాకిస్తాన్‌దే సిరీస్
- చివరి టెస్టులో శ్రీలంకపై విజయం
- యూనిస్ భారీ శతకం
పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో పాకిస్తాన్ గెలుచుకుంది. సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ (271 బంతుల్లో 171 నాటౌట్; 18 ఫోర్లు) తన అద్భుత ఇన్నింగ్స్‌ను చివరి రోజు కూడా కొనసాగించడంతో పాకిస్తాన్ మూడో టెస్టును ఏడు వికెట్ల తేడాతో గెల్చుకుంది. 377 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మంగళవారం తమ ఓవర్‌నైట్ స్కోరు 230/2తో ఆట ప్రారంభించి మరో వికెట్ మాత్రమే కోల్పోయి 103.1 ఓవర్లలో 382 పరుగులు చేసి గెలిచింది.
షాన్ మసూద్ (233 బంతుల్లో 125; 11 ఫోర్లు; 1 సిక్స్) త్వరగానే అవుట్ అయినా.... యూనిస్ చివరి వరకూ నిలబడ్డాడు. కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (103 బంతుల్లో 59 నాటౌట్; 8 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక శ్రీలంక గడ్డపై ఓ ఆతిథ్య జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 300కు పైగా పరుగులు చేసి నెగ్గడం ఇదే తొలిసారి. అలాగే పాక్ జట్టు కు కూడా ఓవరాల్‌గా ఇదే అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన. లంకపై సిరీస్ గెలవడం వల్ల పాకిస్తాన్ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరింది.