
4 సిక్సర్లు... 444 పరుగులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ఘట్టాలు
ఏడాది మొదలవగానే బెన్ స్టోక్స్ తన భీకర బ్యాటింగ్‌తో విరుచుకుపడితే... నా పేరు లేకుండా ‘ఫాస్టెస్ట్’ జాబితా ఎలా ఉంటుంది అన్నట్లుగా వెళుతూ వెళుతూ బ్రెండన్ మెకల్లమ్ పెను దాడికి పాల్పడ్డాడు... ‘ప్రపంచ’ హీరోగా మారేందుకు టన్నుల కొద్దీ పరుగులే చేయాలా, నాలుగు బంతులు చాలవా అనుకొని కార్లోస్ బ్రాత్‌వైట్ విధ్వంసం సృష్టిస్తే... మేమూ మారుతున్నాం అంటూ వరల్డ్ రికార్డు కొట్టి మరీ ఇంగ్లండ్ ప్రకటించుకుంది... పాక్ పుష్ అప్‌లు, ఆసీస్ పతనం కూడా గత పన్నెండు నెలలలో అందరికీ గుర్తుండిపోయాయి. టెస్టులు, టి20లలో అత్యధిక విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను భారత జట్టు శాసించినా... మన టీమ్ భాగం కాని అనేక చిరస్మరణీయ క్షణాలు 2016లో ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో క్రికెట్ అభిమానుల మనసులో నిలిచిపోయిన కొన్ని ఘట్టాలను చూస్తే...
స్టోక్స్ ‘డబుల్’ స్ట్రోక్
కొత్త సంవత్సరంలో మూడో రోజే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ సంచలన బ్యాటింగ్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో స్టోక్స్ 163 బంతుల్లోనే ‘డబుల్ సెంచరీ’ సాధించి టెస్టు చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తం 198 బంతుల్లో 30 ఫోర్లు, 11 సిక్సర్లతో 258 పరుగులు చేశాడు. మరోవైపు ఇదే ఏడాది టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఈ ఘనతను తక్కువ టెస్టుల్లో సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవలే అతని 11 వేల పరుగులు కూడా పూర్తయ్యాయి.
మెకల్లమ్ ‘ఫినిషింగ్ టచ్’
విధ్వంసకర ఆటగాడిగా తనకున్న గుర్తింపును బ్రెండన్ మెకల్లమ్ తన కెరీర్ చివరి మ్యాచ్‌లోనూ నిలబెట్టుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో మెకల్లమ్ 54 బంతుల్లోనే సెంచరీ సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో 56 బంతుల్లో సెంచరీ చేసిన వివియన్ రిచర్డ్స్, మిస్బా రికార్డును అతను సవరించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్లతో 145 పరుగులు సాధించాడు. మరోవైపు శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో కివీస్ క్రికెటర్ కొలిన్ మున్రో 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు.
వెస్టిండీస్ మహిళలకే పట్టం
వెస్టిండీస్ పురుషుల జట్టు విజేత కావడానికి కొద్దిసేపు ముందే విండీస్ మహిళల టీమ్ కూడా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచింది. తుది పోరులో ఆ జట్టు 8 వికెట్లతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
బెంబేలెత్తించిన బ్రాత్‌వైట్
వెస్టిండీస్ జట్టు రెండోసారి టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో విండీస్ 4 వికెట్లతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అయితే ఫైనల్లో కార్లోస్ బ్రాత్‌వైట్ కురిపించిన సిక్సర్ల వర్షం ఈ టోర్నీని చిరస్మరణీయం చేసింది. గెలుపు కోసం చివరి ఓవర్లో విండీస్ 19 పరుగులు చేయాల్సి ఉండగా, స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ తొలి నాలుగు బంతుల్లో వరుసగా 6, 6, 6, 6 బాది తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫైనల్ ముగిసిన తర్వాత కెప్టెన్ స్యామీ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం కూడా అదే స్థాయిలో హైలైట్‌గా నిలిచింది.
విండీస్ కుర్రాళ్లూ కొట్టేశారు
అండర్–19 ప్రపంచ కప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న భారత్‌కు ఫైనల్లో వెస్టిండీస్ యువ సేన షాక్ ఇచ్చింది. ఢాకాలో జరిగిన ఫైనల్లో విండీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
పాకిస్తాన్ ‘పుష్ అప్స్’
ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెంచరీ సాధించిన అనంతరం పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ ‘సెల్యూట్’... మ్యాచ్ గెలిచాక జట్టు మొత్తం కలిసి చేసిన ‘పుష్ అప్స్’ ఈ ఏడాది మేటి చిత్రాల్లో నిలిచాయి. ఈ సిరీస్ తర్వాత పాకిస్తాన్ తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరింది. మరోవైపు 2010లో ఇదే మైదానంలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం, జైలు శిక్షకు గురైన మొహమ్మద్ ఆమిర్ పునరాగమనం తర్వాత అదే లార్డ్స్‌లో తన తొలి టెస్టు ఆడటం యాదృచ్ఛికం. ఫిక్సింగ్‌లో అతని సహ నిందితులైన మొహమ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్ కూడా ఇటీవలే అధికారికంగా దేశవాళీ క్రికెట్‌లోకి మళ్లీ అడుగు పెట్టారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో అజహర్ అలీ తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ నమోదు చేయడం పాక్ క్రికెట్‌కు సంబంధించి మరో విశేషం.
సూపర్ ఛేజింగ్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ముందుగా దక్షిణాఫ్రికా 229 పరుగులు చేయగా, ఆ తర్వాత ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 230 పరుగులు సాధించింది. టి20 ప్రపంచ కప్‌లో ఛేజింగ్‌లో ఇదే రికార్డు కాగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ టి20ల్లో రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో రూట్ 44 బంతుల్లో 83 పరుగులు, జేసన్ రాయ్ 16 బంతుల్లో 43 పరుగులు చేశారు.
ఇంగ్లండ్‌ను వణికించిన పులులు
బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ విజయాన్ని అందుకుంది. తొలి టెస్టులో విజయానికి చేరువగా వచ్చి అనూహ్యంగా ఓడిన బంగ్లాదేశ్, రెండో టెస్టులో 108 పరుగులతో తొలిసారిగా ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 2000లో టెస్టు హోదా పొందిన తర్వాత ఆడిన 95 మ్యాచ్‌లలో ఆ జట్టుకు ఇది ఎనిమిదో విజయం మాత్రమే. విండీస్, జింబాబ్వే తర్వాత బంగ్లా చేతిలో ఓడిన మూడో జట్టు ఇంగ్లండ్. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ మెహదీ హసన్ విశేషంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి టెస్టులో 7 వికెట్లు, రెండో టెస్టులో 12 వికెట్లు తీసిన 19 ఏళ్ల హసన్ మొత్తం 19 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాన్ని అందుకున్నాడు.
ఇంగ్లండ్ వన్డే వెలుగులు
క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్ జట్టు తొలి వన్డే ఆడి 45 ఏళ్లు అయినా, మూడు ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరినా... కొన్నేళ్లుగా వన్డేల్లో ఆ జట్టు ఆటతీరు నామమాత్రమే. చిన్నజట్లు కూడా దూసుకుపోగా ఇంగ్లండ్ పాతతరంలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడిప్పుడే మార్పు చూపిస్తున్న ఆ జట్టు 2016లో గొప్ప మైలురాయిని చేరింది. పాకిస్తాన్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 వికెట్లకు 444 పరుగుల స్కోరు సాధించింది. వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 122 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 171 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్ ఆ జట్టు తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఆస్ట్రేలియా చిత్తు చిత్తుగా...
30 ఏళ్లలో ఆస్ట్రేలియాతో జరిగిన 11 సిరీస్‌లలో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన శ్రీలంక తమ సొంతగడ్డపై సత్తా చాటింది. కంగారూలతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఏడాది ఆసీస్ పతనం ఇక్కడితో ఆగలేదు. దక్షిణాఫ్రికాకు వెళ్లి తమ చరిత్రలో తొలిసారి 0–5తో ఘోరంగా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా దక్షిణాఫ్రికాకు 1–2తో టెస్టు సిరీస్‌ను అప్పగించింది. హోబర్డ్‌లో జరిగిన రెండో టెస్టులో స్మిత్ సారథ్యంలోని ఆస్ట్రేలియా 85 పరుగులకే కుప్పకూలి సొంతగడ్డపై 32 ఏళ్లలో అతి చెత్త రికార్డును నమోదు చేసింది.
2016లో టాపర్స్
► టెస్టుల్లో అత్యధిక పరుగులు: జో రూట్ (1477)
► అత్యధిక వికెట్లు: రవిచంద్రన్ అశ్విన్ (72)
► వన్డేల్లో అత్యధిక పరుగులు: వార్నర్ (1388)
► అత్యధిక వికెట్లు: ఆడమ్ జంపా (30)
► టి20ల్లో అత్యధిక పరుగులు: కోహ్లి (641)
► అత్యధిక వికెట్లు: జస్‌ప్రీత్ బుమ్రా (28)