మాంచెస్టర్: కరోనాను కాదని ముందడుగు పడిన ఈ టెస్టు సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఫలితాన్నిచ్చింది. గత మ్యాచ్ కంటే గడిచిన సిరీస్ గెలిచిన వెస్టిండీస్‌కే కాస్త అనుకూలత ఉంది. నేటి నుంచి జరిగే ఆఖరి టెస్టు డ్రా చేసుకున్నా సరే... విజ్డెన్ ట్రోఫీని కరీబియన్ జట్టు నిలబెట్టుకుంటుంది. అలాగని ఇంగ్లండ్ జోరును తక్కువ అంచనా వేయలేని పరిస్థితి గత మ్యాచ్ కళ్లకు కట్టింది. వరుసగా ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఏకంగా సిరీసే చేతికొస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరు ఆరంభం నుంచి రసవత్తరంగా జరిగే అవకాశముంది.
స్టోక్స్ జోరుతో...
ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జోరుతో ఆతిథ్య జట్టు ట్రాక్‌లో పడింది. రెండో టెస్టులో భారీ శతకంతో పాటు మెరుపు అర్ధసెంచరీ ఇంగ్లండ్‌ను రేసులో నిలిపింది. ఓపెనర్ సిబ్లీ కూడా సెంచరీతో ఫామ్‌లోకి రావడం... ఈ ఆఖరి మ్యాచ్ కూడా మాంచెస్టర్‌లోనే జరగడం కలిసొచ్చే అంశం. బట్లర్ కూడా మెరుగ్గానే రాణించాడు. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ టచ్‌లోకి రావడంతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అలాగని బౌలింగ్ దళం లోటుపాట్లతో ఏమీ లేదు.
రెండో టెస్టులో బుడగ దాటి క్రమశిక్షణ చర్యకు గురైన ఆర్చర్ ఇప్పుడు ఆఖరి పోరుకు అందుబాటులోకి రావడం ఇంగ్లండ్‌కు తుది జట్టు సెలక్షన్ తలనొప్పులు తెచ్చిపెట్టింది. గత మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్‌తో పాటు బ్రాడ్, వోక్స్ చక్కగా రాణించారు. దీంతో ఎవరిని పక్కనబెట్టాలన్నది టీమ్ మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. పైగా ఈ మ్యాచ్‌లో అండర్సన్‌ను ఆడితే కరన్‌తో పాటు, వోక్స్‌నూ బెంచ్‌కే పరిమితం చేసే అవకాశముంటుంది.
హోల్డర్ సేన సత్తా చాటాల్సిందే
తొలి టెస్టులో కనబరిచిన ఆల్‌రౌండ్ ప్రదర్శన రెండో టెస్టుకొచ్చే సరికి నీరుగారిపోయింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, మిడిలార్డర్‌లో బ్లాక్‌వుడ్, రోస్టన్ చేజ్‌లు మాత్రం నిలకడగా ఆడుతున్నప్పటికీ మిగతావారిలో డౌరిచ్, బ్రూక్స్, షై హోప్ ఒక ఇన్నింగ్స్ ఆడితే మరో ఇన్నింగ్స్ విఫలమవుతున్నారు. కీలకమైన తరుణంలో బ్యాట్స్‌మెన్ బాధ్యతగా ఆడలేకపోవడం జట్టును కలవర పెడుతుంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేసిన కరీబియన్ బౌలర్లు... గత మ్యాచ్‌లో మాత్రం ఆ మేరకు ప్రభావం చూపలేదు. సౌతాంప్టన్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ స్టోక్స్‌ను కట్టడి చేసిన విండీస్ కెప్టెన్ హోల్డర్ మాంచెస్టర్‌లో మాత్రం తేలిపోయాడు. గత మ్యాచ్ వైఫల్యాలను అధిగమిస్తే నిర్ణాయక పోరులో జట్టుకు కలిసొస్తుంది. లేదంటే సిరీస్‌నే ప్రత్యర్థి చేతిలో పెట్టాల్సివుంటుంది.
జట్లు (అంచనా)
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, స్టోక్స్, ఒలీపోప్, బట్లర్, బెస్, ఆర్చర్, అండర్సన్, బ్రాడ్.
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్, హోప్, బ్రూక్స్, చేజ్, బ్లాక్‌వుడ్, డౌరిచ్, జోసెఫ్, రోచ్, గాబ్రియెల్.
Comments
Please login to add a commentAdd a comment