అప్పటివరకూ బీసీసీఐతో చర్చల్లేవ్!
కరాచీ: గత డిసెంబర్లో జరగాల్సిన భారత-పాకిస్తాన్ క్రికెట్ జట్ల ద్వైపాక్షిక సిరీస్పై ఇరు దేశాల క్రికెట్ పెద్దలు పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. ఇక్కడ రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉండటంతో భారత-పాక్ క్రికెట్ సిరీస్పై ఎటువంటి ముందడుగు పడలేదు. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ తాజాగా స్పందించారు. ఇటీవల కాలంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎటువంటి చర్చలు జరపకపోవడానికి కారణం తమ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడమేనని స్పష్టం చేశారు. ఒకవేళ బీసీసీఐతో ఎటువంటి చర్చలు జరపాలన్నా, ముందుగా తమ ప్రభుత్వ అనుమతి అవసరమన్నారు. అంతవరకూ బీసీసీఐతో ఎటువంటి చర్చలు జరపదలుచుకోలేదని షహర్యార్ అన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలున్నట్లు పేర్కొన్నారు.
ఇదే కారణం చేత అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సమావేశాల్లోనూ బీసీసీఐ పెద్దల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ అక్కడి ప్రభుత్వ ఎంపీ కూడా కావడంతో ఇరు దేశాల క్రికెట్ సిరీస్పై చర్చించడం సులభతరం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత జనవరిలో తటస్థ వేదికపై ద్వైపాక్షిక సిరీస్ జరపడానికి కూడా బీసీసీఐ వెనుకడుగు వేయడంతో తాము చాలా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చిన తరువాత మరోసారి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో చర్చలు జరపుతామన్నారు. ఆ సమయం వచ్చే వరకూ వేచి చూడక తప్పదని షహర్యార్ అన్నారు.