నీరు పల్లమెరుగు అన్నట్లే పరుగు ప్రవాహామెరిగిన మ్యాచ్ ఇది. రహనే శతకంతో రాజస్తాన్ భారీ స్కోరే చేసింది. గెలుపు ఆశలతో ఉంది. కానీ ప్రత్యర్థి ఢిల్లీ కూడా ఛేదనలో ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా శిఖర్ ధావన్ తాను ఉన్నంతసేపు దంచేస్తే... రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో బంతి పదేపదే బౌండరీని తాకింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయం వరించింది.
జైపూర్: ఐపీఎల్‌లో మళ్లీ బంతి బలయింది. బ్యాట్ చెలరేగింది. దీంతో లక్ష్యం పెద్దదైనా ఛేదన సులువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ (36 బంతుల్లో 78 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పవర్ హిట్టింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే (63 బంతు ల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్ స్మిత్ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించాడు. రబడకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఛేజింగ్‌కు అవసరమైన బ్యాటింగ్ చేశాడు. గోపాల్ 2 వికెట్లు తీశాడు. పంత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మార్పుల్లేని రాయల్స్ జట్టు బరిలోకి దిగగా... ఢిల్లీ క్యాపిటల్స్‌లో సందీప్ లమిచానే స్థానంలో మోరిస్ తుది జట్టులోకి వచ్చాడు.
సామ్సన్ డకౌట్...
టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు క్రీజులోకి వచ్చిన సంజూ సామ్సన్ (0) ఒక్క బంతి ఆడకుండానే రనౌటయ్యాడు. తర్వాత రహానేకు కెప్టెన్ స్మిత్ జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో జట్టును నడిపించారు. రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన (ఇన్నింగ్స్ ఐదోది) ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న రహానే షార్ట్ ఫైన్ లెగ్‌లోకి షాట్ ఆడాడు. అక్కడే ఉన్న ఇషాంత్ శర్మ సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో బతికి పోయిన రహానే ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ వెంటనే రెండు బంతులను 6, 4గా తరలించాడు.
రహానే కళాత్మక వేగం...
లైఫ్ దక్కిన రహానే అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. కళాత్మక షాట్లతో అలరించాడు. రబడ వేసిన ఆరో ఓవర్లో సిక్స్, ఫోర్‌తో 14 పరుగులు సాధించాడు. దీంతో పవర్‌ప్లేలో రాయల్స్ స్కోరు 52/1కు చేరింది. మరుసటి ఓవర్లోనే రహానే చూడచక్కని బౌండరీ బాది 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ కూడా ఫోర్లు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. దీంతో 10 ఓవర్లలో రాజస్తాన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. స్మిత్ 11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి కెప్టెన్ శ్రేయస్ శతవిధాలా కష్టపడినా ఫలితం పొందలేకపోయాడు. మరోవైపు స్మిత్ కూడా 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాతి బంతికే అతను నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మిగతా వారెవరూ నిలకడగా ఆడలేకపోయారు. స్టోక్స్ (8), టర్నర్ (0), పరాగ్ (4) పెద్దగా కష్టపడలేదు. స్టువర్ట్ బిన్నీ (19; 2 ఫోర్లు) అండతో 58 బంతుల్లో రహానే శతకం సాధించాడు. అయితే రబడ ఆఖరి ఓవర్లో బిన్నీ, పరాగ్ వికెట్లను పడగొట్టడంతో జట్టు 200 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది.
ధనాధన్ ఆరంభం...
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 192 పరుగులు. అంటే ఓవర్‌కు దాదాపు 10 పరుగులు చేయాలి. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలిద్దరు కూడా ఛేదించాల్సిన లక్ష్యానికి తగ్గట్లే ధనాధన్ ఆరంభమిచ్చారు. దీంతో క్యాపిటల్స్ స్కోరు క్రమపద్ధతిలో దూసుకెళ్లింది. రెండో ఓవర్ వేసిన కులకర్ణి బౌలింగ్‌లో 6, 4 బాదిన ధావన్ తన అర్ధసెంచరీ చేసేదాకా ఇదే ధాటిని కొనసాగించాడు. దీంతో ధావన్ ఉన్నంత సేపూ ప్రతీ ఓవర్లోనూ బౌండరీలు, సిక్సర్లు అలవోకగా వచ్చాయి. 25 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్సర్లు) శిఖర్ అర్ధశతకం పూర్తయింది. ఆ వెంటనే మరో బౌండరీ కొట్టిన అతను నిష్క్రమించడంతో 72 పరుగుల శుభారంభం ముగిసింది.
పంత్ పటాకా...
అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4) విఫలమయ్యాడు. 77 పరుగుల వద్ద రెండో వికెట్. రాజస్తాన్ శిబిరంలో ఆనందం. కానీ ఈ ఆనందం ఆవిరయ్యేందుకు, ఢిల్లీ చితగ్గొట్టేందుకు ఎక్కువ సమయం పట్టనే లేదు. ఓపెనర్ పృథ్వీ షా (39 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన హిట్టర్ రిషభ్ పంత్ ఆద్యంతం తన ధాటిని కొనసాగించాడు. ఇద్దరు మరో భాగస్వామ్యానికి తెరలేపారు. ఒక ఓవర్లో çపృథ్వీ షా బౌండరీలు బాదితే మరుసటి ఓవర్లో పంత్ సిక్సర్లు కొట్టాడు. ఇలా ఒకర్నిమించి మరొకరు రాజస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేయడంతో కొండంత లక్ష్యం చిన్నదైంది. పంత్ 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించాక పృథ్వీ ఆట ముగిసినా... రూథర్‌ఫర్డ్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలువకపోయినా... రిషభ్ పంత్ తన సిక్సర్ల ధాటితో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు. కులకర్ణి, పరాగ్ చెరో వికెట్ తీశారు.
►ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడం ద్వారా టి20 చరిత్రలో వరుసగా ఐదు ఇన్సింగ్స్‌లో ఖాతా తెరవకుండా ఔటైన తొలి బ్యాట్స్‌మన్‌గా ఆస్టన్ టర్నర్ గుర్తింపు పొందాడు.
►ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టుపై నమోదైన సెంచరీలు.
►ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో నమోదైన సెంచరీలు. సామ్సన్ (రాజస్తాన్), బెయిర్‌స్టో, వార్నర్ (హైదరాబాద్), లోకేశ్ రాహుల్ (పంజాబ్), కోహ్లి (బెంగళూరు), రహానే (రాజస్తాన్) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment