రంజుగా ప్లే ఆఫ్ రేసు | playoff race Teams in IPL matches | Sakshi
Sakshi News home page

రంజుగా ప్లే ఆఫ్ రేసు

Published Thu, May 22 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

playoff race Teams in IPL matches

పంజాబ్, చెన్నైలకు ఇప్పటికే అర్హత
రాజస్థాన్, కోల్‌కతాలకు మెరుగైన అవకాశాలు
 
 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్‌లో 56 మ్యాచ్‌లకు గాను 48 మ్యాచ్‌లు ముగిశాయి. ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఏడో సీజన్‌లో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంతకుముందే  ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఢిల్లీకి ఎలాంటి అవకాశాలు లేవు. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆయా జట్ల ప్రస్తుత స్థితి...     
 - సాక్షి క్రీడావిభాగం
 
 రాజస్థాన్ రాయల్స్
 ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు
 ఆడాల్సినవి: 23న పంజాబ్ (మొహాలీలో)తో, 25న ముంబై (వాంఖడేలో)తో
 ప్లే ఆఫ్ అవకాశాలు: రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి నెగ్గినా రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు సమీకరణాలతో సంబంధం లేకుండానే అర్హత సాధిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడటం ద్వారా రాజస్థాన్ రన్‌రేట్ మరింతగా పడిపోతుంది. లేదంటే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు  ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోవాలి.
 
 కోల్‌కతా నైట్ రైడర్స్
 ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు
 మిగిలిన మ్యాచ్‌లు: 22న బెంగళూరు (ఈడెన్‌లో)తో,
 24న హైదరాబాద్ (ఈడెన్‌లో)తో
 ప్లే ఆఫ్ అవకాశాలు: కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ రెండూ ఓడితే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి.
 
 ముంబై ఇండియన్స్
 ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు
 మిగిలిన మ్యాచ్‌లు: 23న ఢిల్లీతో, 25న రాజస్థాన్‌తో (రెండు వాంఖడేలోనే)
 ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. రన్‌రేట్ కూడా మెరుగుపడాలి. అలాగే హైదరాబాద్, బెంగళూరు జట్లు తప్పనిసరిగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. రాజస్థాన్, కోల్‌కతాలలో ఒక జట్టు రెండు మ్యాచ్‌లు ఓడాలి.
 
  బెంగళూరు రాయల్ చాలెంజర్స్
 ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు
 మిగిలిన మ్యాచ్‌లు: 22న కోల్‌కతా (ఈడెన్‌లో)తో,
 24న చెన్నై (బెంగళూరులో)తో
 ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో తనకన్నా మెరుగైన స్థానంలో ఉన్న రాజస్థాన్, కోల్‌కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో అయినా ఓడిపోవాలి. బెంగళూరు రన్‌రేట్ కూడా మెరుగుపడాలి.
 
 హైదరాబాద్ సన్‌రైజర్స్
 ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు
 మిగిలిన మ్యాచ్‌లు: 22న చెన్నై (రాంచీలో)తో,
 24న కోల్‌కతా (ఈడెన్‌లో)తో
 ప్లే ఆఫ్ అవకాశాలు: తదుపరి దశకు చేరాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలుపుతో పాటు రేసులో ఉన్న మిగిలిన జట్ల ఫలితాలపై సన్‌రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్, కోల్‌కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో బెంగళూరు, ముంబై జట్లు కచ్చితంగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. హైదరాబాద్ రన్‌రేట్ కూడా మెరుగుపడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement