అందుకే డబుల్ సెంచరీ చేశాను..!
నార్త్ సౌండ్(ఆంటిగ్వా):
ఇతర ఆటగాళ్లు ఎవరైనా ఒత్తిడిలో ఉంటే ఆడటం చాలా కష్టమని, తమ వల్ల కాలేదని చెబుతుంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం చాలా స్పెషల్. ఒత్తిడి తనకు మరింత ఎనర్జీని ఇస్తుందని వ్యాఖ్యానించాడు. ఆంటిగ్వా టెస్టులో డబుల్ సెంచరీ(200) చేయడానికి కారణాలను వెల్లడించాడు. వెస్టిండీస్లో మెరుగ్గా ఆడలేడని నాపై విమర్శలున్నాయని, అయితే ఇక్కడ కూడా తాను అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని వంద కోట్ల భారత అభిమానులు కోరుకుంటున్నారని తెలిపాడు. ఆ ఒత్తిడినే తనకు ఆశీర్వాదంగా భావించి మెరుగైన ఇన్నింగ్స్ ఆడినట్లు చెప్పాడు.
ఐదేళ్ల కింద ఇక్కడ మూడు టెస్టులాడినా కేవలం 76 పరుగులే చేయడం తనను నిరాశకు గురిచేసిందన్నాడు. ఈసారి కోహ్లీ విండీస్ గడ్డపై రాణించాలని ఫ్యాన్స్ కోరుకున్నారని, ప్రస్తుతం అది సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. సెంచరీనే నమోదు చేయని గడ్డపై ఏకంగా డబుల్ సెంచరీ సాధించినందుకు ఈ సిరీస్ తనకెప్పుడూ ప్రత్యేకమేనని కోహ్లీ అంటున్నాడు. క్రీజులో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటానని, అందుకే మరో ఎండ్ లో కూడా తానే ఉన్నట్లు ఫీలవుతుంటానని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా కోహ్లి నిలిచాడు. గతంలో ఉన్న అజహర్ (192) రికార్డును సవరించాడు. ఉపఖండం బయట 2006 తర్వాత డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాడు కోహ్లీ. విండీస్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడు కోహ్లి. గతంలో ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ మాత్రమే ఈ ఘనత సాధించారు.