Sachin And Virat Scored The 29th Test Hundred In Port Of Spain - Sakshi
Sakshi News home page

Sachin And Virat: సచిన్‌.. కోహ్లి.. ఇద్దరూ ఒకేలా..!

Published Sat, Jul 22 2023 4:20 PM | Last Updated on Sat, Jul 22 2023 5:59 PM

Sachin And Virat Scored Their 29th Test Hundred In Port Of Spain - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఇద్దరూ క్రికెట్‌కు సంబంధించి చాలా విషయాల్లో ఒకేలా ఉంటారు. ఆట పట్ల అంకితభావం, జట్టును గెలిపించాలన్న కసి.. ఇలా చాలా విషయాల్లో ఇద్దరు దిగ్గజాల మధ్య దగ్గరి పోలికలు ఉంటాయి. ఇక పరుగులు సాధించడం​, రికార్డులు కొల్లగొట్టడం విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏదో ప్లాన్‌డ్‌గా జరుగుతున్నట్లు సచిన్‌లా కోహ్లి జర్నీ కొనసాగుతుంది. విండీస్‌తో రెండో టెస్ట్‌కు ముందు కోహ్లి 499 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 75 శతకాలు చేసి ఉంటే, సచిన్‌ కూడా 499 మ్యాచ్‌ల తర్వాత అన్నే శతకాలు సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కోహ్లికి సంబంధించి చాలా మైల్‌స్టోన్స్‌లో సచిన్‌తో సరిసమానంగా నిలిచాడు.

ఇలాంటిదే మరొకటి కోహ్లి 500వ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. 2002లో ప్రస్తుతం భారత్‌.. విండీస్‌ను ఢీకొంటున్న పోర్ట్‌ ఆఫ్‌  స్పెయిన్‌ వేదికగా సచిన్‌ తన 29వ టెస్ట్‌ సెంచరీని నమోదు చేయగా.. యాదృచ్చికంగా కోహ్లి కూడా ఇదే మైదానంలో తన 29వ టెస్ట్‌ సెంచరీ చేశాడు. గణం​కాల విషయంలో ఇలాంటి ఎన్నో ఘటనలు సచిన్‌, కోహ్లిల మధ్య జరిగాయి. 

ఇదిలా ఉంటే, కోహ్లి తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 500వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా, దిగ్గజ క్రికెటర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ (29) రికార్డు సమం చేయటం.. ఇలా, కోహ్లి తన 29వ టెస్ట్‌ శతకంతో పలు రికార్డులు నమోదు చేశాడు. రెండో రోజు ఆటలో కోహ్లి (206 బంతుల్లో 121; 11 ఫోర్లు) శతకానికి తోడు రవీంద్ర జడేజా (152 బంతుల్లో 61; 5 ఫోర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (78 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో  438 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (33) ఔట్‌ కాగా.. బ్రాత్‌వైట్‌ (37), మెక్‌కెంజీ (14) క్రీజ్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement