
బెంగాల్ సంచలన విజయం
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ సంచలన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఈ జట్టు 32-25 తేడాతో పటిష్ట జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. బెంగాల్ విజయంలో జంగ్ కున్ లీ 12 రైడింగ్ పాయింట్లతో కీలకంగా వ్యవహరిం చాడు. ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో బెంగాల్‌కు ఇది కేవలం రెండో విజయం. జైపూర్‌కు వరుసగా ఇది రెండో పరాజయం. ఆరంభంలో 13వ నిమిషంలో ఇరు జట్ల స్కోరు 10-10తో సమానంగా ఉన్న దశలో లీ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో ఐదు పాయింట్ల ఆధిక్యం లభించింది.
తొలి అర్ధ భాగాన్ని 18-13తో ముగించిన బెంగాల్ ఆతర్వాత కూడా జైపూర్‌ను ఇబ్బంది పెట్టింది. డిఫెండర్ నీలేష్ షిండే నాలుగు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. జైపూర్ నుంచి అజయ్ కుమార్ 11 రైడింగ్ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ పట్నా పైరేట్స్ 34-24 తేడాతో యు ముంబాను ఓడించింది. దీంతో 36 పాయింట్లతో జైపూర్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.
ప్రొ కబడ్డీలో నేడు
పుణెరి పల్టాన్ X జైపూర్ పింక్ పాంథర్స్
రాత్రి 8 గంటల నుంచి
బెంగాల్ వారియర్స్ X పట్నా పైరేట్స్
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం