పుజారా ‘షో’ | Pujara 'show' | Sakshi
Sakshi News home page

పుజారా ‘షో’

Published Sat, Aug 29 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

పుజారా ‘షో’

పుజారా ‘షో’

♦ అజేయ సెంచరీతో చెలరేగిన ఓపెనర్
♦ అమిత్ మిశ్రా అర్ధసెంచరీ
♦ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292/8
♦ }లంకతో మూడో టెస్టు
 
 కొలంబో : ‘మా టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో పుజారాకు చోటు లేదు. అందరూ ఫామ్‌లో ఉన్నారు కాబట్టి స్థానం దక్కడం కష్టమే’  నిన్నటి వరకు భారత జట్టు మేనేజ్‌మెంట్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఇప్పుడు... మూడో టెస్టులో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లందరూ బ్యాట్లు ఎత్తేసి పెవిలియన్‌కు వెళ్తుంటే... అదే పుజారా ఆపద్బాంధవుడిలా జట్టును ఆదుకున్నాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఓపికగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. చతేశ్వర్ (277 బంతుల్లో 135 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ సెంచరీతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 95.3 ఓవర్లలో 8 వికెట్లకు 292 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా (87 బంతుల్లో 59; 7 ఫోర్లు) రాణించాడు. పుజారాతో పాటు ఇషాంత్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మూడో సెషన్ చివర్లో వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను ముందుగానే ముగించారు.

 50/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన పుజారా, కోహ్లి నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ పిచ్ నుంచి సహకారం అందుకున్న లంక బౌలర్లు ఒత్తిడి పెంచారు. సెషన్ తొలి ఓవర్‌లో రెండుసార్లు ఎల్బీ అప్పీల్‌ల నుంచి బయటపడ్డ కోహ్లిని 24వ ఓవర్‌లో మ్యాథ్యూస్ అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తొలి గంటలో భారత్ 15 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది. తర్వాత రోహిత్ (26) స్పిన్నర్లపై అటాకింగ్‌కు దిగడంతో పరుగుల వేగం పెరిగింది. రెండో ఎండ్‌లో పుజారా కూడా కౌశల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదాడు. దీంతో 41వ ఓవర్‌లో టీమిండియా 100 పరుగులకు చేరుకుంది.

 అదే క్రమంలో పుజారా 127 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. లంచ్‌కు కొద్ది ముందు రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత తొలి బంతికే బిన్నీ (0) వెనుదిరగడంతో భారత్ స్కోరు 119/5గా మారింది. తర్వాత నమన్ ఓజా (21) నిలకడగా ఆడి పుజారాకు చక్కని సహకారం అందించాడు. అయితే ఏడు పరుగుల తేడాలో ఓజా, అశ్విన్ (5) అవుట్‌కావడంతో భారత్ మరోసారి తడబడింది.

ఈ దశలో టెయిలెండర్ మిశ్రా కీలక ఇన్నింగ్స్ ఆడగా... పుజారా 214 బంతుల్లో ఏడో సెంచరీ సాధించాడు. మిశ్రా, పుజారా ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడంతో భారత్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 71 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన మిశ్రా సెషన్ చివర్లో అవుటయ్యాడు. తర్వాత ఇషాంత్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. దమ్మిక ప్రసాద్ 4 వికెట్లు తీశాడు.

 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) ప్రసాద్ 2; పుజారా బ్యాటింగ్ 135; రహానే ఎల్బీడబ్ల్యు (బి) ప్రదీప్ 8; కోహ్లి (సి) పెరీరా (బి) మ్యాథ్యూస్ 18; రోహిత్ (సి) తరంగ (బి) ప్రసాద్ 26; బిన్నీ ఎల్బీడబ్ల్యు (బి) ప్రసాద్ 0; ఓజా (సి) తరంగ (బి) కౌశల్ 21; అశ్విన్ (సి) పెరీరా (బి) ప్రసాద్ 5; మిశ్రా (స్టంప్డ్) పెరీరా (బి) హెరాత్ 59; ఇషాంత్ బ్యాటింగ్ 2; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (95.3 ఓవర్లలో 8 వికెట్లకు) 292. వికెట్ల పతనం: 1-2; 2-14; 3-64; 4-119; 5-119; 6-173; 7-180; 8-284.
 బౌలింగ్: ప్రసాద్ 23.3-4-83-4; ప్రదీప్ 22-6-52-1; మ్యాథ్యూస్ 13-6-24-1; హెరాత్ 25-3-81-1; కౌశల్ 12-2-45-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement