న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమే మంచిదని భారత చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ఒలింపిక్స్‌ను తొలుత అనుకున్న ప్రకారం షెడ్యూల్ టైమ్‌లోనే నిర్వహిస్తామని బుధవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) స్పష్టం చేసింది. దీంతో ఐఓసీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ వాయిదా వేయాలనే వారికి గోపీ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.
‘ఒలింపిక్స్ నిర్వహణపై నాకు సందేహాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సమయం లేదు. గేమ్స్ జరపాలనుకుంటే ఇప్పటికే అందుకు సన్నాహాలు మొదలవ్వాల్సింది. కాబట్టి ఐఓసీ దీనిపై పునరాలోచించి తన నిర్ణయాన్ని తొందరగా ప్రకటిస్తే ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితులు, ఆరోగ్య భద్రత, ప్రయాణ ఆంక్షలు బట్టి చూస్తే గేమ్స్ నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్నది. వాటిని వాయిదా వేస్తేనే మంచిది’ అని గోపీ వివరించాడు.
ఆల్ ఇంగ్లండ్ కూడా నిలిపివేయాల్సింది...
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో తాజాగా జరిగిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ కూడా నిలిపివేయాల్సిందని గోపీచంద్ అన్నాడు. ‘కచ్చితంగా బీడబ్ల్యూఎఫ్ తప్పు నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం ద్వారా ఆటగాళ్లను ప్రమాదంలోకి నెట్టేసింది’ అని 2001 ఆల్ ఇంగ్లండ్ టైటిల్ విజేత గోపీ పేర్కొన్నాడు.
కఠిన పరిస్థితుల్లో బీడబ్ల్యూఎఫ్...
ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఏప్రిల్ 28 తుది గడువు కాగా కరోనా కారణంగా బీడబ్ల్యూఎఫ్ అర్హత పోటీలన్నీ రద్దు చేయడంపై కూడా ఆటగాళ్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గడువును పొడిగించాలని వారు కోరుతున్నారు. అయితే ఇది అనుకున్నంతా సులభంగా తీసుకునే నిర్ణయం కాదని గోపీచంద్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎటు తేల్చుకోలేని సంకట స్థితిలో బీడబ్ల్యూఎఫ్ ఉందని చెప్పాడు. ‘ఈ పరిస్థితి ఎవరూ ఊహించనిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మెరిట్‌తో పాటు డీమెరిట్ కూడా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చే విధంగా వ్యవహరించడం ఎవరి వల్లా కాదు. బీడబ్ల్యూఎఫ్ ఇప్పుడు ఇదే పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శల పాలవుతుంది. క్వాలిఫయింగ్ గడువు పెంచితే టోర్నీల నిర్వహణ, వీసా, సహాయక సిబ్బంది ఇలా చాలా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆమోదించాల్సిందే. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా బీడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకోవాలని కోరుకోవాలి’ అని గోపీచంద్ వివరించాడు.
ఒలింపియన్లకు నష్టమేం ఉండదు
ఈనెల 31 వరకు ‘సాయ్–గోపీచంద్ అకాడమీ’ మూసేయడం ద్వారా ఒలింపిక్స్ ఆశావహుల ప్రాక్టీస్‌కు నష్టమేం ఉండదని గోపీ చెప్పాడు. ‘కేవలం రెండు వారాలు అకాడమీకి రాకుంటే పోయేదేం ఉండదు. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఆడి ఆటగాళ్లు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించి వచ్చారు. వారు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే. ఏప్రిల్‌లో ఆడాల్సిన టోర్నీలు కూడా లేవు. ఆటగాళ్లకు కూడా విశ్రాంతి అవసరం. ఈ సమయంలో వారు ఫిట్‌నెస్‌పై శ్రమిస్తే మంచిది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment