హైదరాబాద్:విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా ఇక్కడ జింఖానా మైదానంలో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఆటగాడు మన్ దీప్ సింగ్ , గుర్ కీరత్ సింగ్ లు దూకుడుగా ఆడారు. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ లో మన్ దీప్(117 నాటౌట్; 97 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు) అజేయ సెంచరీ నమోదు చేయగా, గుర్ కీరత్ సింగ్ (62; 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు పర్గత్ సింగ్(69)లు ఆకట్టుకోగా, జీవన్ జోత్ సింగ్(32), యువరాజ్ సింగ్ (36) ఫర్వాలేదనిపించారు. దీంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. అస్సాం బౌలర్లలో అమిత్ వర్మకు రెండు వికెట్లు దక్కగా, అహ్మద్, ప్రీతమ్ దాస్ లకు తలో వికెట్ దక్కింది.
ఆంధ్రపై మహారాష్ట్ర విజయం
గ్రూప్-సిలో భాగంగా ఢిల్లీలో పాలెం గ్రౌండ్ లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లో మహారాష్ట్ర 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. మహారాష్ట్రఆటగాళ్లు బావ్నే(100), కేదర్ జాదవ్(101)లు శతకాలు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రలో శ్రీకాంత్(74) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. ఆంధ్ర 42.5 ఓవర్లలో 194 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది.