సైనా మా జట్టుకు బలం
- ఉబెర్ కప్‌లో రాణిస్తాం
- పీవీ సింధు వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత స్టార్ సైనా నెహ్వాల్‌తో కలిసి ఉబెర్ కప్‌లో రాణిస్తానని ఏపీ రైజింగ్ స్టార్ పీవీ సింధు తెలిపింది. త్వరలో జరిగే ఈ టీమ్ ఈవెంట్‌లో హైదరాబాదీలిద్దరు కలిసి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుండటం ఇదే తొలిసారి. దీనిపై ఈ తెలుగమ్మాయి మాట్లాడుతూ జట్టుకు సైనా నెహ్వాల్ బలమని చెప్పింది. దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌ఖేల్త్న్ర’కు తనను నామినేట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. పురుషుల విభాగంలో థామస్ కప్, మహిళల విభాగంలో ఉబెర్ కప్ టీమ్ టోర్నీలు ఈ నెల 18 నుంచి 25 వరకు ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్‌లో జరుగనున్నాయి.
‘ఉబెర్ కప్‌లో భారత బృందం పటిష్టంగా ఉంది. సైనా తొలి సింగిల్స్‌లో శుభారంభమిస్తే... నేను రెండో సింగిల్స్‌లో సత్తాచాటుతా. అప్పుడు జట్టుకు ఫలితాలు కలిసి వస్తాయి. డబుల్స్‌లోనూ భారత క్రీడాకారిణులు రాణించేందుకు చక్కని అవకాశాలుంటాయి’ అని సింధు విశ్లేషించింది. టీమ్ టోర్నమెంట్ దృష్టా ప్రస్తుతం భారత పురుషుల, మహిళల జట్లకు ఆతిథ్య వేదిక వద్దే వారం పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.
ఈ శిబిరంలో భారత కోచ్ పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, మధుమిత బిస్త్‌లు తమ ఆటతీరుకు మెరుగులు దిద్దుతున్నారని సింధు చెప్పింది. తాము తరచూ చేసే తప్పులను సరిదిద్దుతున్నారని 19 ఏళ్ల టీనేజ్ సంచలనం పేర్కొంది. మిగతా టోర్నీలకు ఈ టీమ్ చాంపియన్‌షిప్ భిన్నమైనదని తెలిపింది. ఆయా టోర్నీల్లో తమకు తాము వ్యక్తిగతంగా గెలిస్తే చాలనుకుంటామని... ఇక్కడ (ఉబెర్) మాత్రం సమష్టిగా గెలవాలనే కసితో బరిలోకి దిగుతామంది. సొంతగడ్డపై టోర్నీ జరగనుండటం తమకు కలిసివస్తుందని, ప్రేక్షకుల మద్దతుతో ముందంజ వేస్తామని సింధు చెప్పింది.