సింధు సునాయాసంగా..
⇒ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన భారత స్టార్
⇒జయరామ్‌కు చుక్కెదురు
⇒ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
వుహాన్: చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత నం.1 ప్లేయర్, రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో అలవోకగా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, నాలుగో సీడ్ సింధు 21–14, 21–15తో ప్రపంచ 15వ ర్యాంకర్ అయా ఓహోరి (జపాన్)పై అలవోకగా విజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లో ముగిసిన ఈమ్యాచ్‌లో భారతస్టార్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిగేమ్ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచిన సింధు అనంతరం దూకుడు ప్రదర్శించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 6–3తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం 7–7తో స్కోరు సమమైనా సింధు మరింత జోరును కొనసాగించి 18–10తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.
ఈ దశలో అయా పోరాడినా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆ గేమ్‌ను సింధు కైవసం చేసుకుంది. రెండోగేమ్ ఆరంభంలోనూ 0–4తో సింధు వెనుకంజలో నిలిచింది. ఈ దశలో కీలకపాయింట్లు సాధించి 5–5, 8–8తో సింధు రెండుసార్లు స్కోరును సమం చేసింది. అనంతరం దూకుడు ప్రదర్శించిన భారతస్టార్ చెలరేగి 18–11తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ ఏడో ర్యాంకర్ హే బింగ్‌జియావో (చైనా)తో సింధు తలపడనుంది. బింగ్‌జియావోతో మూఖాముఖిపోరులో 3–4తో సింధు వెనుకంజలో నిలిచింది. గతేడాది ఇరువురు ఆరుసార్లు తలపడగా..చెరో మూడుసార్లు విజయం సాధించారు. చివరిసారి గత నవంబర్‌లో చైనా ఓపెన్‌లో ఇరువురు తలపడగా.. సింధు గెలుపొందింది. ఈక్రమంలో క్వార్టర్స్‌లో సింధు మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ జయరామ్ 19–21, 10–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ జెన్ హావో హుసు (చైనీస్‌తైపీ)పై ఓడిపోయాడు. దీంతో ఈ టోర్నీలో కేవలం సింధు మాత్రమే బరిలో ఉన్నట్లయ్యింది. 2014 టోర్నీ ఎడిషన్‌లో సింధు కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈసారి తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకోవాలని భారతస్టార్ భావిస్తోంది.