
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. శుక్రవారం పురుషుల, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, పీవీ సింధు ఓటమి పాలయ్యారు. ప్రపంచ ఏడో ర్యాంకర్ హీ బింగ్‌జియావోతో జరిగిన మ్యాచ్‌లో మూడో ర్యాంకర్ సింధు 14–21, 15–21తో పరాజయం పాలైంది. హీ బింగ్‌జియావోతో 11 సార్లు తలపడ్డ సింధుకు ఆరుసార్లు ఓటమి ఎదురైంది.
షి యూకీతో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 17–21, 18–21తో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో చైనా దిగ్గజం లిన్ డాన్‌ను ఓడించిన ప్రణయ్ ఈ మ్యాచ్‌లో మాత్రం చైనా యువ షట్లర్ ముందు నిలువలేకపోయాడు. క్వార్టర్స్‌లో ఓడిన సింధు, ప్రణయ్‌లకు 6,875 డాలర్ల (రూ. 4 లక్షల 73 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 6,600 పాయింట్లు లభించాయి.