ట్రిపుల్ సెంచరీ వీరుడికి నిరాశే!
హైదరాబాద్: టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీలు సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేపై నమ్మకం ఉంచారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు నుంచి రహానే గాయం కారణంగా వైదొలగడంతో అతడి స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. ఆ టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ అందరూ ఊహించినట్లుగా జరగలేదు. రేపు (గురువారం) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టెస్టులో ట్రిపుల్ వీరుడు కరుణ్‌కి చోటు దక్కలేదు. గాయం నుంచి రహానే కోలుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గత రెండేళ్లుగా రహానే జట్టుకు అందించిన సేవలను కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనియాడాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరఫున రహానే అత్యుత్తమ ఆటగాడని, కొన్ని సందర్భాల్లో విఫలమైనంత మాత్రానా పక్కనపెట్టడం సబబు కాదని పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా జట్టులో కొనసాగుతున్న రహానే మద్థతుగా నిలవాల్సిన సమయం ఇదేనని, యాథావిధంగా రహానే జట్టులోకి వస్తున్నాడని చెప్పాడు. ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయకూడదని, న్యూజిలాండ్ లో వారి ఆటతీరును గుర్తుంచుకోవాలని సహచరులకు కెప్టెన్ కోహ్లీ సూచించాడు.