
రహానే అజేయ సెంచరీ
శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 314/6
లంక బోర్డు ప్రెసిడెంట్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్
కొలంబో : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (127 బంతుల్లో 109 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లిసేన 79 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. రహానేతో పాటు అశ్విన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (96 బంతుల్లో 43; 6 ఫోర్లు), శిఖర్ ధావన్ (102 బంతుల్లో 62; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.
అయితే కాసన్ రజిత ధాటికి వన్‌డౌన్‌లో రోహిత్ శర్మ (7)తో పాటు కెప్టెన్ కోహ్లి (8) కూడా విఫలం కావడంతో లంచ్‌కు ముందు భారత్ 133 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రహానే, పుజారా (89 బంతుల్లో 42; 5 ఫోర్లు)లు నిలకడగా ఆడి ఐదో వికెట్‌కు 134 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బందిపడ్డ పుజారా అసహనానికి గురై 66వ ఓవర్‌లో వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆ వెంటనే సాహా (3) అవుటైనా.. అశ్విన్ మెరుగ్గా ఆడటంతో ఏడో వికెట్‌కు అజేయంగా 41 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. కాసన్ రజిత 3, వాండర్సే 2 వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) గుణతిలక (బి) గమగే 43; ధావన్ (సి) పెరీరా (బి) కాసన్ రజిత 62; రోహిత్ (బి) కాసన్ రజిత 7; కోహ్లి (సి) సిరివందన (బి) కాసన్ రజిత 8; రహానే బ్యాటింగ్ 109; పుజారా (సి) పతిరనా (బి) వాండర్సే 42; సాహా (సి) తిరిమన్నే (బి) వాండర్సే 3; అశ్విన్ బ్యాటింగ్ 10; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం: (79 ఓవర్లలో 6 వికెట్లకు) 314.
వికెట్ల పతనం: 1-108; 2-121; 3-130; 4-133; 5-267; 6-273.
బౌలింగ్: ఫెర్నాండో 15-2-29-0; గమగే 15-2-65-1; కాసన్ రజిత 13-2-47-3; వాండర్సే 20-1-76-2; లాహిర్ గమగే 13-2-66-0; సిరివందన 3-1-14-0.