అచ్చం రాహుల్ ద్రవిడ్ లాగానే..
బెంగళూరు:టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో ఘనవిజయాలు అందించాడు. ఇటీవల ఇండియా-ఏ టీమ్ కు కోచ్ గా నియమితుడైన ద్రవిడ్.. అతని కుమారులు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్ లకు కూడా క్రికెట్ పాఠాలు నేర్పే పనిలో పడ్డాడు. వారు క్రికెట్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ లను వీక్షిస్తున్న ద్రవిడ్ వారికి దగ్గరుండి మరీ సలహాలు ఇస్తున్నాడు.
అండర్ -12 స్కూల్ క్రికెట్ లో భాగంగా గురువారం బెంగళూరులో జరిగిన మ్యాచ్ కు హాజరైన రాహుల్ ద్రవిడ్.. కుమారుడు సమిత్ బ్యాటింగ్ ను వీక్షించాడు. తండ్రి ఎదుట క్రికెట్ ఆడిన సమిత్ బ్యాటింగ్ లో మెరిశాడు. అచ్చం తండ్రి తరహాలోనే ఆడుతూ రాహుల్ ను మంత్ర ముగ్ధుడ్ని చేశాడు. మల్ల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరుపున ఆడిన సమిత్ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. దీంతో సమిత్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు 106 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ టోర్నీకి ముందు జరిగిన టోర్నమెంట్ లో సమిత్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరి జూనియర్ ద్రవిడా?మజాకా?