రాంచీని ముంచిన వాన
వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకోవాలంటే 6-1తో సిరీస్ గెలవాల్సిన ఆస్ట్రేలియా లెక్క తప్పినట్లే. భారీ వర్షం ఆ జట్టు ఆశలను ముంచేసింది. దాంతో భారత్ తమ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. వర్షం కారణంగా నాలుగో వన్డే అర్ధాంతరంగా రద్దయింది. ఫలితంగా సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతోంది. తుపాన్‌తో ఐదో వన్డే కూడా సందేహాస్పదంగా మారిన నేపథ్యంలో ఈ సుదీర్ఘ సిరీస్‌ను నెగ్గాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే.
రాంచీ: సొంతగడ్డపై సిరీస్‌ను సమం చేయాలని భావించిన ధోని ఆశలకు అడ్డుకట్ట పడింది. లక్ష్యఛేదనను ఆరంభించిన భారత్ జోరును వర్షం అడ్డుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన భారత్, ఆస్ట్రేలియా నాలుగో వన్డేలో వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటకు అనువుగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడు వన్డేల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్ 2-1తో ఆధిక్యం ఉంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే శనివారం కటక్‌లో జరుగుతుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ బెయిలీ (94 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (77 బంతుల్లో 92; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు చేజార్చుకున్నా, జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... వినయ్ కుమార్, అశ్విన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ధావన్ (14), రోహిత్ శర్మ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ దశలో పడిన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.
కీలక భాగస్వామ్యం...
వరుసగా విఫలమవుతున్న ఇషాంత్‌తో పాటు భువనేశ్వర్‌ను కూడా పక్కన పెట్టడంతో ఉనాద్కట్, మొహమ్మద్ షమీలకు తుది జట్టులో చోటు దక్కింది. ఉనాద్కట్ పెద్దగా ప్రభావం చూపకపోగా, షమీ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇన్నింగ్స్ ఆసాంతం 140-145 కి.మీ. వేగంతో బంతులు విసురుతూ, చక్కటి స్వింగ్ కూడా రాబట్టిన షమీ... తన తొలి నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీసి శుభారంభాన్ని అందించాడు. తన తొలి ఓవర్ ఐదో బంతికే చక్కటి ఇన్‌స్వింగర్‌తో ఫించ్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేసిన అతను... మూడో ఓవర్లో హ్యూస్ (11)ను పెవిలియన్‌కు పంపించాడు. ఆసీస్ స్కోరు 28/0గా ఉన్న దశలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ ప్రారంభమయ్యాక మరో అద్భుతమైన బంతి వాట్సన్ (14) వికెట్లను గిరాటేసింది.
షమీ జోరుతో ఆసీస్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి స్పెల్‌లో షమీ గణాంకాలు 6-1-21-3గా ఉండటం విశేషం. కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో వోజెస్ (7) కూడా వెనుదిరగడంతో ఆసీస్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ బెయిలీ, మ్యాక్స్‌వెల్ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆరంభంలో మెల్లగా ఆడినా నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు బ్యాట్ ఝళిపించారు. బెయిలీ తన వన్డే ఫామ్‌ను కొనసాగించగా, మ్యాక్స్‌వెల్ కూడా భారీ సిక్సర్లతో దూకుడు ప్రదర్శించాడు.
ఈ క్రమంలో బెయిలీ 57 బంతుల్లో, మ్యాక్స్‌వెల్ 45 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరకు వినయ్ కుమార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. భారీ షాట్ ఆడబోయిన బెయిలీ, డీప్ మిడ్ వికెట్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి సెంచరీ చేజార్చుకున్నాడు. తన తర్వాతి ఓవర్లోనే మ్యాక్స్‌వెల్‌ను కూడా వినయ్ అవుట్ చేశాడు. అయితే జాన్సన్ (31 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), ఫాల్క్‌నర్ (29 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్) చివర్లో ధాటిగా ఆడి ఆస్ట్రేలియాకు మెరుగైన స్కోరు అందించారు. ఆసీస్ తమ చివరి 10 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆరు క్యాచ్‌లు నేలపాలు...
నాలుగో వన్డేలో మన ఆటగాళ్ల ఫీల్డింగ్ 90లనాటి భారత జట్టును గుర్తుకు తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేయడం ఫీల్డింగ్ పరిస్థితిని చూపిస్తోంది. వీటిలో రెండు మినహా మిగతా క్యాచ్‌లు పట్టదగినవే! ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దిన బెయిలీ సున్నా స్కోరు వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను మూడో స్లిప్‌లో కోహ్లి వదిలేయడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
అతను 35 వద్ద ఉన్నప్పుడు కూడా మరో సునాయాస క్యాచ్‌ను అశ్విన్ వదిలేశాడు. మ్యాక్స్‌వెల్‌కు కూడా రెండు సార్లు అదృష్టం కలిసొచ్చింది. 44 పరుగుల వద్ద యువరాజ్, 69 పరుగుల వద్ద ధోని క్యాచ్‌లు వదిలేశారు. యువీ క్యాచ్ కష్టమైనదే అయినా... ధోని గ్లవ్‌కు తగిలి వెళ్లిన బంతి మ్యాక్స్‌వెల్‌ను బతికించింది. జాన్సన్ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు రైనా, ఇన్నింగ్స్ చివరి బంతికి ఫాల్క్‌నర్ క్యాచ్‌ను ధావన్ జారవిడిచారు. ఈ రెండింటి వల్ల పెద్దగా తేడా రాకపోయినా మనవాళ్ల ఫీల్డింగ్‌కు ఇది నిదర్శనం.
స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) షమీ 5; హ్యూస్ (సి) ధోని (బి) షమీ 11; వాట్సన్ (బి) షమీ 14; బెయిలీ (సి) రోహిత్ (బి) వినయ్ 98; వోజెస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 7; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) వినయ్ 92; హాడిన్ (బి) జడేజా 3; ఫాల్క్‌నర్ (నాటౌట్) 23; జాన్సన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 25; మెక్‌కే (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 7, వైడ్ 3) 10; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 295.
వికెట్ల పతనం: 1-5; 2-24; 3-32; 4-71; 5-224; 6-232; 7-238; 8-281.
బౌలింగ్: ఉనాద్కట్ 6-0-31-0; షమీ 8-1-42-3; వినయ్ 8-0-52-2; అశ్విన్ 9-0-57-2; జడేజా 10-0-56-1; యువరాజ్ 1-0-12-0; రైనా 8-0-38-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 9; ధావన్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు (బై 4) 4; మొత్తం (4.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 27 బౌలింగ్: జాన్సన్ 2.1-0-10-0; మెక్‌కే 2-0-13-0.