కర్ణాటక కుమ్మేసింది...
సాక్షి, హైదరాబాద్: ఏడో సారి రంజీ ట్రోఫీని గెలుచుకునే దిశగా కర్ణాటక అడుగులు వేస్తోంది. ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో మహారాష్ట్రతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో రెండో రోజు పూర్తిగా కర్ణాటక ఆధిపత్యం ప్రదర్శించింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 230 పరుగులు చేసింది. గణేశ్ సతీశ్ (207 బంతుల్లో 117 బ్యాటింగ్; 16 ఫోర్లు) అద్భుత సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (189 బంతుల్లో 94 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అదే దిశగా దూసుకుపోతున్నాడు. 68 ఓవర్లలో మహారాష్ట్ర ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది.
చేతిలో 10 వికెట్లు ఉన్న కన్నడ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో 75 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. మూడో రోజూ ఇదే తరహాలో ఆడితే జట్టుకు భారీ ఆధిక్యం దక్కడంతో పాటు మ్యాచ్‌పై పూర్తిగా పట్టు చిక్కుతుంది. అంతకు ముందు మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులకు ఆలౌటైంది. 272/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 33 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. కర్ణాటక బౌలర్లలో వినయ్, మిథున్, అరవింద్ తలా 3 వికెట్లు పడగొట్టారు.
భారీ భాగస్వామ్యం...
కర్ణాటక ఇన్నింగ్స్‌ను ఉతప్ప, రాహుల్ ప్రారంభించారు. అయితే 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫలా బౌలింగ్‌లో మోచేతికి బలంగా బంతి తగలడంతో ఉతప్ప రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఈ దశలో రాహుల్‌తో సతీశ్ జత కలిశాడు. ఈ ఇద్దరు చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో కర్ణాటకను నడిపించారు. మహారాష్ట్ర ఫీల్డర్లు ఏకంగా ఐదు క్యాచ్‌లు వదిలేయడంతో... ఆ అవకాశాలను కర్ణాటక బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఉపయోగించుకున్నారు. సతీశ్ 173 బంతుల్లో కెరీర్‌లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో మరాఠా బౌలర్లు చేతులెత్తేశారు.
స్కోరు వివరాలు: మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 305 (బావ్నే 89, అతీత్కర్ 50, ఖురానా 64; వినయ్ 3/81, మిథున్ 3/49, అరవింద్ 3/65)
కర్ణాటక తొలి ఇన్నింగ్స్: ఉతప్ప (రిటైర్డ్‌హర్ట్) 10; రాహుల్ (బ్యాటింగ్) 94; సతీశ్ (బ్యాటింగ్) 117; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (68 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 230.
బౌలింగ్: సమద్ ఫలా 16-2-40-0; సంక్లేచా 15-3-40-0; దరేకర్ 9.5-0-49-0; ముండే 12-2-43-0; ఖురానా 10-1-0-35; అతీత్కర్ 5-0-18-0.