
లండన్: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో శ్రీలంకలో పర్యటించబోయే అండర్-19 భారత జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్ టెండూల్కర్... టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కలిసి కొన్ని విలువైన టిప్స్ తెలుసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా జట్టుతో లండన్‌లో ఉన్న రవిశాస్త్రిని ట్రైనింగ్ సెషనల్‌లో అర్జున్ కలిశాడు.
ఈ మేరకు సోమవారం అర్జున్‌కు రవిశాస్త్రి కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు రవిశాస్త్రి నుంచి అర్జున్ టెండూల్కర్ కొన్ని అమూల్యమైన సలహాలు తీసుకుంటున్నాడు’ అనే క్యాప్షన్ జోడించింది. త్వరలో ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు శనివారం లండన్‌లో దిగింది. అక్కడ్నుంచి బయల్దేరి డబ్లిన్‌కు చేరుకోనుంది. జూన్ 27వ తేదీన తొలి టీ20, జూలై 29న రెండో టీ20 ఆడనుంది. ఈ రెండు టీ20 మ్యాచ్‌లు డబ్లిన్‌లోనే జరుగనున్నాయి. అనంతరం విరాట్ గ్యాంగ్.. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ పర్యటనలో పాల్గొనుంది.