
బర్మింగ్‌హామ్: టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బుధవారం ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ‘నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే రెట్టింపు మ్యాచ్‌లే నేను ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. నేను ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకున్నా. నువ్వు ముందుగా ఏదైనా సాధించినవారిని గుర్తించి గౌరవించడం నేర్చుకో. ఇక నీ చెత్త వాగుడు నేను విన్నది చాలు’ అంటూ సంజయ్ మంజ్రేకర్‌ను ట్యాగ్ చేస్తూ జడేజా ట్వీట్ చేశాడు.
అయితే మంజ్రేకర్‌పై జడేజా ఆగ్రహానికి ఓ కారణం ఉంది. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మంజ్రేకర్.. రవీంద్ర జడేజా లాంటి బిట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు తాను ఫ్యాన్ కానని అన్నాడు. జడేజా టెస్టు క్రికెటర్ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్ అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా జడేజాను అల్‌రౌండర్‌గా పరిగణించబోనని వ్యాఖ్యానించాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా జడేజా నేడు ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment