రాయుడు చెడుగుడు | Rayudu century helps Chennai all but book playoff berth | Sakshi
Sakshi News home page

రాయుడు చెడుగుడు

Published Mon, May 14 2018 3:56 AM | Last Updated on Fri, May 25 2018 7:45 PM

Rayudu century helps Chennai all but book playoff berth - Sakshi

ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే చెన్నైకు కీలక మ్యాచ్‌... ఆ జట్టు సామర్థ్యం ముందు విజయం కష్టం కాదు... అటుచూస్తే ప్రత్యర్థి సన్‌రైజర్స్‌ భీకర బౌలింగ్‌! దానికి తగ్గట్లే ఎదురుగా భారీ లక్ష్యం... అందుకే ఏ మూలనో అనుమానాలు... కానీ రాయుడు వాటిని పటాపంచలు చేశాడు... శతకంతో చితక్కొటి సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.  

పుణే: ఈ ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు మరోసారి మెరిశాడు. దూకుడైన ఆటతో సన్‌రైజర్స్‌ దుమ్ము దులిపాడు. అజేయ శతకంతో చెన్నైను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాయుడు (62 బంతుల్లో 100 నాటౌట్, 7 ఫోర్లు, 7 సిక్స్‌లు)తో పాటు ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (35 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవడంతో సూపర్‌ కింగ్స్‌ 8 వికెట్లతో హైదరాబాద్‌ను అలవోకగా ఓడించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌... ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (49 బంతుల్లో 79; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరులుగు చేసింది. అనంతరం చెన్నై 19 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

అటు ఇద్దరు...
మొత్తం ఆరుగురు బ్యాటింగ్‌కు దిగినా హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌కు ధావన్, విలియమ్సన్‌లే మూల స్తంభాలుగా నిలిచారు. చహర్‌ను ఎదుర్కొనలేక ఇబ్బంది పడిన ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ (2) అతడి బౌలింగ్‌లోనే నిష్క్రమించాడు. దీంతో ధావన్‌కు విలియమ్సన్‌ జత కలిశాడు. వీరు ఆచితూచి ఆడటంతో పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 29/1తో నిలిచింది. అయితే, తర్వాత నుంచి ఇద్దరూ జోరు పెంచుకుంటూ పోయారు. రెండో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక సన్‌రైజర్స్‌ తడబడింది.

సెంచరీ భాగస్వామ్యం...
భువనేశ్వర్‌ ఆధ్వర్యంలోని హైదరాబాద్‌ బౌలింగ్‌ వనరులు, లీగ్‌లో వారి రికార్డును చూస్తే లక్ష్యం కొంత క్లిష్టమైనదే. కానీ చెన్నై ఓపెనర్లు నిలదొక్కుకుని అవలీలగా ఆడేశారు. ఇద్దరిలో ముందుగా వాట్సనే బాదుడు మొదలుపెట్టాడు. భువీ, సందీప్‌ శర్మల ఓవర్లలో మూడు సిక్స్‌లు బాది చూస్తుండగానే 20ల్లోకి వెళ్లిపోయాడు. సిక్స్, ఫోర్‌తో రాయుడు సైతం వేగం పెంచాడు. ఈ క్రమంలో రషీద్‌ ఖాన్, షకీబ్‌ ఇలా ఒక్కో బౌలర్‌ మెడలు వంచారు. పవర్‌ ప్లే ఆఖరుకు చెన్నై 53/0తో నిలిచింది.

అంబటి ధాటికి ఎక్కువగా సిద్ధార్థ్‌ కౌల్‌ బలయ్యాడు. అతడు వేసిన 7, 11వ ఓవర్లలో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు సహా 28 పరుగులు రాబట్టాడు. వాట్సన్‌ 31 బంతుల్లో, రాయుడు 31 బంతుల్లో అర్ధశతకాలు చేశారు. దీంతో ఓపెనింగ్‌ భాగస్వామ్యం వంద దాటింది. తొలి వికెట్‌కు 134 పరుగులు జతయ్యాక వాట్సన్‌ రనౌట్‌తో ఎట్టకేలకు బ్రేక్‌ పడింది. రైనా (2) ఇలా వచ్చి అలా వెళ్లాడు. అయితే రాయుడు, కెప్టెన్‌ ధోని (14 బంతుల్లో 20 నా టౌట్, 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి పని పూర్తి చేశాడు.

శతకం ముంగిట సంకటం...
ఓవైపు ధోని  పరుగులు చేస్తూ లక్ష్యాన్ని తగ్గిస్తుండటంతో రాయుడు  సెంచరీ ముంగిట కొంత ఉత్కంఠ నెలకొంది. వాట్సన్‌ ఉండగానే 50 నుంచి 70ల్లోకి వేగంగా వెళ్లిన రాయుడు... అనంతరం కొంత తగ్గాడు. షకీబ్‌ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో 90ల్లోకి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి కొంత డ్రామా నడిచింది. 18 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని సిక్స్‌ కొట్టి సమీకరణాన్ని 12 బంతుల్లో 8గా మార్చాడు. భువీ బౌలింగ్‌లో అంబటి 98 మీద ఉండగా షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌లోకి ఆడిన బంతి పైకి లేచింది. అక్కడెవరూ లేకపోవడంతో లైఫ్‌ దక్కింది. లక్ష్యం 7 పరుగులు ఉండగా ధోని ఫోర్‌ కొట్టాడు. దీంతో శతకం పూర్తవుతుందా లేదా అనే అనుమానం తలెత్తింది. కానీ, మహి సింగిల్‌ తీసి స్ట్రయికింగ్‌ ఇచ్చాడు. రాయుడు స్క్వేర్‌ లెగ్‌లోకి బంతిని పంపి సెంచరీ సాధించి మునుపెన్నడూ లేనంతటి సంబరం చేసుకున్నాడు.



స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) హర్భజన్‌ (సి) బ్రేవో 79; హేల్స్‌ (సి) రైనా (బి) చహర్‌ 2; విలియమ్సన్‌ (సి) బ్రేవో (బి) శార్దుల్‌ 51; పాండే (సి) విల్లీ (బి) శార్దుల్‌ 5; హుడా నాటౌట్‌ 21; షకీబ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179.  వికెట్ల పతనం: 1–18, 2–141, 3–141, 4–160.

బౌలింగ్‌: చహర్‌ 4–0–16–1, శార్దుల్‌ 4–0–32–2, విల్లీ 2–0–24–0, హర్భజన్‌ 2–0–26–0, వాట్సన్‌ 2–0–15–0, బ్రేవో 4–0–39–1, జడేజా 2–0–24–0.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ రనౌట్‌ 57; రాయుడు నాటౌట్‌ 100; రైనా (సి) విలియమ్సన్‌ (బి) సందీప్‌ శర్మ 2; ధోని నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180.

వికెట్ల పతనం: 1–134, 2–137.

బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–36–1, భువనేశ్వర్‌ 4–0–38–0, రషీద్‌ ఖాన్‌ 4–0–25–0, షకీబ్‌ 4–0–41–0, కౌల్‌ 3–0–40–0.   

13: ఐపీఎల్‌లో సెంచరీ చేసిన 13వ భారతీయ క్రికెటర్‌ అంబటి రాయుడు. 

4: ప్రస్తుత ఐపీఎల్‌   సీజన్‌లో నమోదైన సెంచరీలు. ఈ నాలుగింటిలో మూడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పైనే రావడం గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement