
సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కోచ్ గా పునరాగమనం చేసే అవకాశం కనబడుతోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు పాంటింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ముంబై ఇండియన్స్ కోచ్ గా పని చేసిన అనుభవం పాంటింగ్ కు ఉంది. ఆయన శిక్షణలో ముంబయి 2015లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే రికీ పాంటింగ్ ను కోచ్ గా నియమించేందుకు ఢిల్లీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా పాంటింగ్ తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన మేరకు ఢిల్లీ మెంటర్ గా రాహుల్ ద్రవిడ్ తన పదవిని వదులుకోవడంతో అందుకు పాంటింగే సరైన వ్యక్తిగా ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. తాము పలువురితో కోచ్ పదవికి సంబంధించి చర్చలు జరుపుతున్న విషయాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా స్పష్టం చేశారు.
మరొకవైపు రెండేళ్ల తరువాత ఐపీఎల్లోకి అడుగుపెడుతున్న రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా పాంటింగ్ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన టీమిండియా మాజీ పేసర్ టీఏ శేఖర్ ముంబయి ఇండియన్స్ శిబిరంలో చేరుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment