
ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్ కావాలని ఆశపడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆశాభంగం ఎదురైంది. దాదాను హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్పకనే చెప్పింది. డీసీ.. గౌతమ్ గంభీర్ లాంటి ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తిని హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం ఇద్దరు ముగ్గురు వరల్డ్‌కప్ విన్నర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్నాడు. అలాగే అతను ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీలైన దుబాయ్ క్యాపిటల్స్ (ILT20), ప్రిటోరియా క్యాపిటల్స్ (SA20) మంచి చెడ్డలు కూడా చూస్తున్నాడు. ఇన్ని బాధ్యతలు మోస్తుండటంతో డీసీ యాజమాన్యం గంగూలీని హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది.
కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఏడు సీజన్ల పాటు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన పాంటింగ్ డీసీని ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. ఇదే కారణంగా డీసీ మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసింది.
పాంటింగ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాక గంగూలీ ఈ పదవిపై ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. ఓ బెంగాలీ పేపర్‌ను ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఇదిలా ఉంటే, పాంటింగ్ ఆథ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒకే ఒక్కసారి (2020) ఫైనల్‌కు చేరింది. 2018 ఎడిషన్‌లో తొలిసారి పాంటింగ్ ఆథ్వర్యంలో బరిలోకి దిగిన డీసీ.. ఆ సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆతర్వాతి సీజన్‌లో (2019) మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. 2021 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. గడిచిన మూడు సీజన్లలో ఢిల్లీ 5, 9, 6 స్థానాల్లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment