సైమండ్స్‌ తర్వాతే మన రోహితే.. | Rohit Second Batsman After Symonds To Highest individual scores Against Pak | Sakshi
Sakshi News home page

సైమండ్స్‌ తర్వాతే మన రోహితే..

Published Sun, Jun 16 2019 6:01 PM | Last Updated on Mon, Jun 17 2019 3:14 PM

Rohit Second Batsman After Symonds To Highest individual scores Against Pak - Sakshi

మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు పొందాడు. ఆదివారం దాయాది పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌  113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో  140 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇది వరల్డ్‌కప్‌ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. పాక్‌పై వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆండ్రూ సైమండ్స్‌(ఆస్ట్రేలియా) పేరిట ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో జోహెనెస్‌బర్గ్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సైమండ్స్‌ అజేయంగా 143 పరుగులు సాధించాడు. ఇదే నేటికి పాక్‌పై వరల్డ్‌కప్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆ తర్వాత స్థానాన్ని రోహిత్‌ ఆక్రమించాడు. రోహిత్‌ తర్వాత రాస్‌ టేలర్‌(న్యూజిలాండ్‌) ఉన్నాడు. 2011 వరల్డ్‌కప్‌లో పాక్‌పై రాస్‌ టేలర్ 131 పరుగులు చేశాడు.
(ఇక్కడ చదవండి: పాక్‌పై టీమిండియా సరికొత్త రికార్డు)

పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ 85 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం నమోదు చేశాడు. ఇది రోహిత్‌కు వన్డే కెరీర్‌లో 24వ సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో రెండో సెంచరీ. ఇది ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో రోహిత్‌కు మూడో సెంచరీ.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్‌(57) పెవిలియన్‌ చేరాడు. రియాజ్‌ బౌలింగ్‌లో బాబర్‌ అజామ్‌కు సునాయసమైన క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో కోహ్లితో కలిసి మరో 98 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన రోహిత్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. హసన్‌ అలీ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌ దిశగా షాట్‌ ఆడబోయిన రోహిత్‌ ఔటయ్యాడు. ఆపై కోహ్లి-హార్దిక్‌ పాండ్యాలు భారత్‌ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు. 43 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.( ఇక్కడ చదవండి:అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement