అబుదాబి విజేత రోస్ బర్గ్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ లో చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన రోస్ బర్గ్ విజేతగా నిలిచాడు. 55 ల్యాప్ ల రేసును రోస్ బర్గ్ ఒక గంటా 38 నిమిషాల 30. 175 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
రోస్ బర్గ్ కంటే ఎనిమిది నిమిషాల 217 సెకన్లు వెనుకబడ్డ అతని సహచర రేసర్ హమిల్టన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ రైకోనెన్ మూడో స్థానాన్ని సాధించాడు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఐదు, ఏడు స్థానాలతో సంతృప్తి పడ్డారు. అంతకుముందు మెక్సికన్ గ్రాండ్ ప్రి , బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన రోస్ బర్గ్ అదే ఊపును అబుదాబి గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు. దీంతో ఈ సీజన్ లో ఆరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్న రోస్ బర్గ్... ఓవరాల్ గా 14వ టైటిల్ ను సాధించాడు.