
రాస్ టేలర్ రికార్డు సెంచరీ
- న్యూజిలాండ్ 246/7
- పాక్‌తో తొలి వన్డే
దుబాయ్: రాస్ టేలర్ (135 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) వన్డేల్లో వరుసగా మూడో శతకం సాధించడంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఒక దశలో 111/5 స్కోరుతో నిలిచిన కివీస్‌ను టేలర్ ఆదుకున్నాడు. రోంచి (23), వెటోరి (27)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
ఈ ఏడాది ఆరంభంలో భారత్‌పై వరుసగా రెండు సెంచరీలు చేసిన టేలర్ ఈ మ్యాచ్‌లో సెంచరీతో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా అతను ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడు. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్‌కు 3, రియాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌తో సస్పెన్షన్‌కు గురైన మొహమ్మద్ హఫీజ్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు.