సచిన్ బంగారం!
ప్రత్యేక బంగారు నాణేలు విడుదల చేసిన ఈస్టిండియా కంపెనీ
లండన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్‌కు కనకాభిషేకం జరిగింది. అతని ఘనతలను గుర్తు చేస్తూ బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీ కొత్తగా ప్రత్యేక బంగారు నాణేలను విడుదల చేసింది. ఈ సంస్థ సచిన్ 24 ఏళ్ల కెరీర్ నేపథ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో చేసిన నాణేలు తయారు చేసింది. సచిన్ టెస్టుల సంఖ్యను సూచించే విధంగా ఒక్కో నాణెం 200 గ్రాముల బరువు ఉంది. ఒక్కోటి 12 వేల పౌండ్లు (దాదాపు రూ. 12 లక్షలు) విలువైన 210 నాణేలు మార్కెట్లో ఇప్పుడు అభిమానుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటికి బ్రిటన్ ప్రభుత్వంనుంచి అధికారిక గుర్తింపు, విలువ ఉన్నాయి.
నాణెంలో ఒక వైపు సచిన్ బొమ్మ, అతని టెస్టు జెర్సీ నం 187, మాస్టర్ సంతకంతో కూడిన బ్యాట్, స్వస్థలం ముంబైని సూచించే విధంగా ఇండియా గేట్ బొమ్మ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు అని దానిపై రాసి ఉంది. నాణేనికి మరో వైపు బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ బొమ్మ ఉంది. వేర్వేరు కారణాలతో నాణేల విడుదల ఆలస్యమైనా...ఒక దిగ్గజంతో జత కట్టడం సంతోషంగా ఉందని ఈస్టిండియా కంపెనీ సీఈఓ సంజీవ్ మెహతా వెల్లడించారు.