
గ్రేగ్ ఛాపెల్ ఓ రింగ్ మాస్టర్:సచిన్
క్రికెట్ ఆడినన్నిరోజులు వివాదాలకు దూరంగా ఉన్నభారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథలో మాత్రం మాజీ భారత్ కోచ్ గ్రెగ్ ఛాపెల్ ను తీవ్రంగా దుయ్యబట్టాడు.
ముంబై: క్రికెట్ ఆడినన్నిరోజులు వివాదాలకు దూరంగా ఉన్నభారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో మాత్రం భారత్ మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ ను తీవ్రంగా దుయ్యబట్టాడు. ఛాపెల్ తన అభిప్రాయాల్ని బలవంతంగా ఆటగాళ్లపై రుద్దేవాడని సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లో వెల్లడించాడు. చాపెల్ ను ఓ రింగ్ మాస్టర్ గా సచిన్ అభివర్ణించాడు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో పలు చీకటి రోజులను గుర్తు చేసుకున్న 41 ఏళ్ల సచిన్ .. మాజీ కోచ్ ఛాపెల్ పై విమర్శనాస్త్రాలు సంధించి సరికొత్త వివాదానికి తెరలేపాడు.
2005 సంవత్సరంలో భారత్ కోచ్ గా బాధ్యతలు ఛాపెల్ ఎప్పుడూ ఆటగాళ్లు తన చెప్పు చేతల్లో ఉండాలని భావించేవాడని సచిన్ పేర్కొన్నాడు. సచిన్ తీసుకొస్తున్న ఆత్మకథ పుస్తకంపై సహచర ఆటగాడు సౌరభ్ గంగూలీ వెనకేసుకొచ్చాడు. ఆ ఆత్మకథలో సచిన్ వాస్తవాలే చెబుతాడన్న గంగూలీ .. ఛాపెల్ గురించి సచిన్ ప్రస్తావించిన విషయాల్ని తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తున్నట్లు పేర్కొన్నాడు. సచిన్ ఆత్మకథ పుస్తకం నవంబర్ 6వ తేదీని బహిరంగ మార్కెట్ లోకి రానుంది.