
‘మాస్టర్ సెంచరీ చేయాలి’
ముంబై: సచిన్ టెండూల్కర్ తన ఆఖరి టెస్టులో సెంచరీ చేసి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. మాస్టర్ 200వ టెస్టు ఆడుతున్న వేదిక వాంఖడే క్యూరేటర్ సుధీర్ నాయక్ కూడా దీనికి అతీతమేం కాదు. అంత గొప్ప ఆటగాడు సెంచరీతోనే వీడ్కోలు పలకాలని ఆయన కూడా కోరుకుంటున్నారు. అయితే దానికి తన సహాయం అవసరం లేదని, పని చేసే సమయంలో భావోద్వేగాలకు తావులేదని అంటున్నారు. ‘సచిన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన మొదటి రోజు నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. దీనికి తోడు తను మా నగరానికి చెందిన దిగ్గజం. కాబట్టి ఇక తన ఆటను చూడలేం అనే ఆలోచనే బాధపెడుతోంది. తను సెంచరీ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకోసం నేనేదో ప్రత్యేకంగా పిచ్‌ను తయారు చేయాల్సిన పని లేదు.
నేను కూడా కొన్ని నిబంధనలకు లోబడి పని చేయాలి. పనిలో భావోద్వేగాలకు తావు లేదు’ అని సుధీర్ నాయక్ చెప్పారు. ఎలాంటి పిచ్ తయారు చేయాలో తనకెవరూ చెప్పలేదని, ఎప్పుడూ స్పోర్టింగ్ వికెట్ ఉండాలని తాను కోరుకుంటానని నాయక్ అన్నారు.