సైనా శుభారంభం
జకర్తా:ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభ చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో సైనా నెహ్వాల్ 17-21, 21-18, 21-12 తేడాతో ఇంతనోన్ రాచనోక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ ను కోల్పోయిన సైనా.. రెండు, మూడు గేమ్లను పోరాడి గెలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. తొలి గేమ్ లో సైనా 10-4 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో రాచనోక్ వరుస పాయింట్ల సాధిస్తూ దూసుకొచ్చింది.
అదే క్రమంలో స్కోరును 14-14 సమం చేయడమే కాకుండా ఆ గేమ్ ను సొంతం చేసుకుంది. ఆపై రెండో గేమ్ లో సైనా తన అనుభవాన్ని ఉపయోగించింది. రెండో గేమ్ లో 12-7 తేడాతో సైనా ఆధిక్యం సాధించనప్పటికీ, 16-16 వద్ద రాచనోక్ స్కోరును సమం అయ్యింది. ఆ సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయని సైనా మరో రెండు పాయింట్లు మాత్రమే కోల్పోయి గేమ్ ను దక్కించుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. ఆ గేమ్ లో రాచనోక్ ను సునాయాసంగా ఓడించిన సైనా రెండో రౌండ్ లోకి అర్హత సాధించింది. మరొకవైపు మిక్స్ డ్ డబుల్స్ లో సుమిత్ రెడ్డి-అశ్విన్ పొన్నప్ప లు 12-21,9-21 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇర్ఫాన్ ఫదిల్లాహ్-వెనీ అన్ గ్రైనీపై చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.