
సైనా మళ్లీ సాధించేనా!
గతేడాది 20 నెలల నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్ సాధించి భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫామ్‌లోకి వచ్చింది.
నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్
సిడ్నీ: గతేడాది 20 నెలల నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్ సాధించి భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగిస్తున్న ఈ హైదరాబాద్ అమ్మాయి మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో సైనా తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో ఆడుతుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సైనాకు టైటిల్ సాధించే అవకాశాలు క్లిష్టంగా ఉన్నాయి. తొలి రౌండ్ దాటితే సైనాకు రెండో రౌండ్‌లో, క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పురుషుల క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ బరిలో ఉన్నాడు. మెయిన్ ‘డ్రా’లో శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.