తొలి టైటిల్ లక్ష్యంగా సైనా బరిలోకి
సారావాక్ (మలేసియా): ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రూపంలో కావాల్సినంత ప్రాక్టీస్ పొందిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది తొలి టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతోపాటు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోటీలు జరుగుతాయి. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా క్వాలిఫయర్‌తో ఆడుతుంది. సైనాతోపాటు మరో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ నేరుగా మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగింది. తొలి రౌండ్‌లో జిన్ వీ గో (మలేసియా)తో శ్రీకృష్ణప్రియ తలపడుతుంది.
ఇతర స్టార్ క్రీడాకారిణుల గైర్హాజరీలో... పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించే క్రమంలో ఉన్న సైనా తన స్థారుుకి తగ్గ ఆటతీరు కనబరిస్తే ఈ టోర్నీలో విజేతగా నిలిచే అవకాశముంది. పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్, రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ, ఆదిత్య జోషి, ప్రతుల్ జోషి, అభిషేక్, హర్షీల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; కోనా తరుణ్-ఫ్రాన్సిస్; అర్జున్-రామచంద్రన్; సాత్విక్ -చిరాగ్ శెట్టి జోడీలు పోటీపడుతున్నాయి.