గెలిచినా ఇంటికే...
కౌలాలంపూర్: ఈ ఏడాదిని విజయంతో ముగించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన ఖాతాలో మాత్రం ఒక్క టైటిల్‌నూ జమచేసుకోలేకపోయింది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా 21-11, 17-21, 21-13తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో జురుయ్ లీ (చైనా) 21-11, 21-14తో మినత్సు మితాని (జపాన్)ను ఓడించింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక జురుయ్ లీ గ్రూప్ ‘బి’లో అజేయంగా నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకొని సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
సైనా, యోన్ జూ బే, మితాని ఒక్కో విజయం, రెండు పరాజయాలతో సమఉజ్జీలుగా నిలిచారు. టోర్నీ నిబంధనల ప్రకారం మెరుగైన గేమ్స్ సగటు ఆధారంగా ఈ గ్రూప్‌లో రెండో స్థానం పొందిన యోన్ జూ బే సెమీఫైనల్‌కు చేరుకోగా... సైనా, మితాని వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఇంటిముఖం పట్టారు. యోన్ జూ బే 3 గేమ్‌లు నెగ్గి, 4 గేమ్‌లను చేజార్చుకోగా... సైనా 3 గేమ్‌లు నెగ్గి, 5 గేమ్‌లను కోల్పోయింది. మితాని 2 గేమ్‌లు సాధించి, 5 గేమ్‌లను చేజార్చుకుంది. దాంతో -1 గేమ్స్ సగటుతో యోన్ జూ బే ముందంజ వేయగా, -2 గేమ్స్ సగటుతో సైనాకు, -3 గేమ్స్ సగటుతో మితానికి నిరాశ ఎదురైంది. ఒకవేళ యోన్ జూ బేపై సైనా వరుస గేముల్లో గెలిచి ఉంటే సెమీఫైనల్‌కు అర్హత పొందే అవకాశం ఉండేది.
సైనా 2007 తర్వాత తొలిసారి తన ఖాతాలో ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా లేకుండా సీజన్‌ను ముగించింది. 2008 నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక అంతర్జాతీయ టైటిల్‌ను సాధించిన సైనా... ఈ సంవత్సరం ఆడిన 14 టోర్నమెంట్లలో ఏ ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది.