వరుసగా ఐదో మ్యాచ్ నెగ్గిన సైనా | Saina Nehwal won the fifth match in a row | Sakshi
Sakshi News home page

వరుసగా ఐదో మ్యాచ్ నెగ్గిన సైనా

Published Wed, Aug 28 2013 1:35 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

వరుసగా ఐదో మ్యాచ్ నెగ్గిన సైనా - Sakshi

వరుసగా ఐదో మ్యాచ్ నెగ్గిన సైనా

ఆటలోనే కాదు ఆదరణలోనూ భారత బ్యాడ్మింటన్‌కు రాజధాని తానేనని హైదరాబాద్ నిరూపించుకుంది. ఐబీఎల్‌కు ఏ నగరంలోనూ లేనంత ఆదరణ భాగ్యనగరంలో లభించింది. సైనా... సైనా... స్టేడియమంతా ఈ పేరు జపిస్తుండగా... భారత స్టార్ క్రీడాకారిణి స్థాయికి తగ్గట్లుగా ఆడి లీగ్‌లో ఓటమి లేకుండా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ గెలిచింది. సైనా రాణించినా... సహచరుల పేలవ ప్రదర్శనతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హాట్‌షాట్స్‌కు ఓటమి ఎదురైంది. కానీ పాయింట్ల పట్టికలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది.
 
 సాక్షి, హైదరాబాద్: సైనా నెహ్వాల్ నేతృత్వంలోని హైదరాబాద్ హాట్‌షాట్స్ జట్టు ఐబీఎల్ లీగ్ దశలో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగా బీట్స్ చేతిలో 2-3తో ఓడినా... లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ గెలవగా, మరో పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో  బెంగళూరుకు విజయం దక్కింది. ఆసక్తికరంగా సాగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-17, 14-21, 11-8 స్కోరుతో యింగ్ తై జుపై విజయం సాధించింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణే, అవధ్ సెమీస్ చేరగా, ఢిల్లీ, బంగా బీట్స్ నిష్ర్కమించాయి.
 
 హోరాహోరీ...
 ఐబీఎల్‌లో వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం...సొంత ప్రేక్షకుల మద్దతు...అన్ని అనుకూలతల మధ్య బరిలోకి దిగినా... సైనా నెహ్వాల్‌కు విజయం అంత సులభంగా దక్కలేదు. ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి యింగ్ తై జు, సైనాకు గట్టి పోటీ ఇచ్చింది. సైనా ఎక్కువగా స్మాష్‌లపై ఆధార పడితే..తై జు చక్కటి సర్వీస్‌తో పాటు ప్లేసింగ్స్‌ను నమ్ముకుంది. మొదటి గేమ్‌లో ఆరంభంలో తై ఆధిక్యం ప్రదర్శించింది. అయితే కోలుకున్న సైనా ఆ వెంటనే చక్కటి స్మాష్‌లతో  దూసుకుపోయింది. 7-4, 11-7, 15-10...ఇలా హాట్‌షాట్స్ షట్లర్ ముందంజలో నిలిచింది. మధ్యలో తై జు రెండు సార్లు వరుసగా మూడేసి పాయింట్లు నెగ్గి చేరువగా వచ్చింది. అయితే సైనా 18-17 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్ సొంతం చేసుకుంది.
 
 తై జు దూకుడు...
 రెండో గేమ్‌లో బంగా ప్లేయర్ యింగ్... సైనాను పూర్తిగా కట్టడి చేసింది. సుదీర్ఘమైన ర్యాలీలు జరగడంతో సైనా అలసినట్లుగా కనిపించింది. పైగా సైనా కొట్టిన ఎక్కువ షాట్లు అవుట్‌గా వెళ్లడంతో ప్రత్యర్థి ఖాతాలో పాయింట్లు చేరాయి. సైనా డ్రాప్‌షాట్లు కూడా విఫలమయ్యాయి. ఒక దశలో సైనా 11-10తో ముందుకు వెళ్లినా తై జు ఎదురుదాడి చేసింది. వేగంగా దూసుకుపోయి 16-14తో నిలిచింది. ఈ దశలో ఏకంగా ఐదు పాయింట్లు కొల్లగొట్టి గేమ్‌ను గెల్చుకుంది. మూడో గేమ్‌లో మొదటినుంచి సైనా ముందంజలో నిలిచింది. కొన్ని సార్లు ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా ఒత్తిడిని తట్టుకొని హైదరాబాద్ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచింది.
 
 ఇదేం పద్ధతి?
 సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలచిన జట్టు ఆఖరి స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడుతుంది. ఐబీఎల్ ఆరంభంలో ఈ లీగ్‌లోనూ ఇదే పద్ధతి అనుకున్నారు. కానీ సెమీస్‌కు రెండు రోజుల ముందు మాత్రం... హైదరాబాద్ సొంత నగరంలో సెమీస్ ఆడేలా చూడాలని భావించారు. ఇంత వరకు కూడా ఓకే. కానీ హైదరాబాద్ ప్రత్యర్థి ఎవరనే అంశాన్ని మాత్రం కాస్త విడ్డూరంగా నిర్ణయించారు. నిజానికి టాప్‌లో ఉన్న హైదరాబాద్, నాలుగో స్థానంలో ఉన్న ముంబై సెమీస్‌లో తలపడాలి. కానీ ఈ రెండు బలమైన జట్లు ఆడటం నిర్వాహకులకు ఇష్టం లేదు.
 
  దీంతో హడావుడిగా మంగళవారం రాత్రి... ఒక సమావేశం ఏర్పాటు చేసి మొదటి స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడుతుందని నిర్ణయించేశారు. నాలుగు జట్ల మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనికి పుణే, అవధ్ జట్లు ఎలా అంగీకరించాయో...! మొత్తానికి లీగ్ ఆరంభం నుంచి ఏర్పాట్ల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నిర్వాహకులు... చివరకు సెమీస్ లైనప్‌ను నిర్ణ యించడంలోనూ విమ ర్శల పాలయ్యారు.
 
 కశ్యప్ చిత్తు...
 ఐబీఎల్‌లో పారుపల్లి కశ్యప్ పేలవ ప్రదర్శన చివరి మ్యాచ్‌లోనూ కొనసాగింది. హాట్‌షాట్స్ కుర్రాడు తనోంగ్‌సక్ బూన్‌సాక్ 21-20, 21-18తో కశ్యప్‌ను చిత్తు చేశాడు. హైదరాబాద్ ప్రేక్షకులు అండగా నిలిచినా తన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయాడు. పురుషుల డబుల్స్‌లో మాగన్సన్-అక్షయ్ దివాల్కర్ జోడి 21-15, 15-21, 11-1 తేడాతో గో వి షెమ్-వా లిమ్ కిమ్ జంటను చిత్తు చేసింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్‌లో బంగా ప్లేయర్ జాన్ జార్గన్సన్ 21-11, 21-8తో అజయ్ జయరామ్‌పై ఘన విజయం సాధించాడు. చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రద్య్న గాద్రె-తరుణ్ కోన జంట 21-18, 16-21, 9-11తో మాగన్సన్-అపర్ణా బాలన్ చేతిలో ఓడిపోయారు. దీంతో బంగా బీట్స్ 3-2తో లీగ్‌ను విజయంతో ముగించింది.
 
 సెమీస్‌లో ఎవరితో ఎవరు
 నేడు: సెమీఫైనల్ 1
 హైదరాబాద్ హాట్‌షాట్స్
     x
 పుణే పిస్టన్స్
 వేదిక: హైదరాబాద్
 
 
 రేపు: సెమీఫైనల్ 2
 అవధ్ వారియర్స్
         x
 ముంబై మాస్టర్స్
 వేదిక: బెంగళూరు
 
 శనివారం: ఫైనల్
 వేదిక: ముంబై
 
 రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement