వీడ్కోలు టెస్టులో నిరాశపర్చిన సంగక్కర!
కొలంబో: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక వెటరన్ ఆటగాడు కుమార సంగక్కర నిరాశపరిచాడు. తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సంగక్కర(32) స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వేసిన బంతి సంగా బ్యాట్ ను ముద్దాడి స్లిప్ లో ఉన్న రహానే కు దొరికింది. దీంతో సంగా 'చివరి' తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. అంతకుముందు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య స్టేడియంలోకి వచ్చిన సంగాక్కరకు టీమిండియా ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ తెలిపారు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన సంగాకు చివరి మ్యాచ్ ఘనంగా ఉంటే బావుంటుందని సగటు క్రీడాభిమాని భావించాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఆ అవకాశం చేజార్చుకున్న సంగా.. రెండో ఇన్నింగ్స్ లో రాణిస్తాడో?లేదో?వేచి చూడాల్సిందే.
ముగిసిన రెండో రోజు ఆట
టీమిండియా 349 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను ముగించడంతో బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్ కరుణ రత్నే(1) వికెట్ ను ఆదిలోనే చేజార్చుకుంది.మరో ఓపెనర్ కౌశల్ సిల్వా(51)రాణించడంతో శ్రీలంక కాస్త కుదుట పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇంకా 253 పరుగులు వెనుకబడివున్న శ్రీలంకను తిరుమన్నే(28*), మాథ్యూస్(19*)లు ఆదుకునే యత్నం చేస్తున్నారు.